
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర నూతన పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్, ప్రస్తుతం హోం శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ అనంతరం, సీవీ ఆనంద్‌ను తెలంగాణ పోలీస్ ఫోర్స్ హెడ్ (డీజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. వీరికి రూ. 2,25,000 (అపెక్స్ స్కేల్) వేతన శ్రేణి వర్తించనుంది. గతంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆనంద్, మే 1వ తేదీన కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లతో కూడిన జాబితాను పరిశీలించిన అనంతరం, అందరికంటే సీనియర్ అయిన 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది.
