
99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలువుతున్న 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు కార్యాచరణ ఏర్పాట్లు, అలాగే పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డులలో తప్పనిసరిగా గ్రామ సభలు, వార్డు సభలను నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై పౌరులలో విస్తృత అవగాహన కల్పించడానికి ఈ ప్రజా సభలను ఒక సమర్థవంతమైన వేదికగా ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక నిరంతర సవరణ ప్రక్రియపై ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. అర్హులైన పౌరులంతా ఓటరు జాబితా నమోదు, నూతనీకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు లాభదాయకమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసేందుకు ‘పంట మార్పిడి’ పై ఈ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో, వార్డుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) నిబంధనలపై ప్రజలకు వివరించి, పర్యావరణ పరిరక్షణలో సమాజాన్ని భాగస్వాములను చేయాలని కోరారు.
ఈ గ్రామ, వార్డు సభలలో ప్రతిపాదించిన కార్యక్రమాలు.. ఇప్పటికే 99 రోజుల ప్రణాళికలో భాగంగా అమలవుతున్న థీమాటిక్ వారోత్సవాలకు అదనంగా ఉంటాయని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక నాయకులను ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య పరస్పర సమన్వయం అత్యంత కీలకమని, అప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు శాంతిభద్రతల సమస్యలు లేకుండా విజయవంతంగా సాగుతాయని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
