Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో నేరాల‌ రేటు 14.1 శాతం తగ్గింది: హోంమంత్రి అనిత

రాష్ట్రంలో నేరాల‌ రేటు 14.1 శాతం తగ్గింది: హోంమంత్రి అనిత

Gaddamidi Naveen
17 జూన్, 2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, విపత్తుల నిర్వహణ వంటి అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె శాఖల వారీగా సాధించిన ప్రగతిని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను పునర్నిర్మిస్తూ, సాంకేతికత, పారదర్శకతతో ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పరిపాలనను అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, నేరం జరగకుండా ముందుగానే నిరోధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

సాంకేతికత ఆధారిత పోలీసింగ్, సీసీటీవీలు, డ్రోన్లు, ఏఐ విశ్లేషణల ద్వారా రాష్ట్రంలో మొత్తం నేరాల రేటు సుమారు 14.1 శాతం తగ్గిందని మంత్రి వెల్లడించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ “శక్తి యాప్” ద్వారా ఇప్పటివరకు 11.15 లక్షలకు పైగా ఎస్ఓఎస్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇచ్చినట్లు తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలు, జిల్లా స్థాయి యంత్రాంగం పనిచేస్తున్నాయని వివరించారు.

“ఆపరేషన్ ముస్కాన్” ద్వారా 8,396 మంది తప్పిపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులను గుర్తించి కుటుంబాలకు చేర్చినట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో బాధిత చిన్నారులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

డ్రగ్స్, గంజాయి నియంత్రణలో భాగంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఈగ‌ల్ ద్వారా విస్తృత దాడులు నిర్వహించగా 56,674 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. అంతర్రాష్ట్ర మాదకద్రవ్య నెట్‌వర్క్‌లను అడ్డుకోవడంతో పాటు రూ.4 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యూహంతో పని చేస్తూ ఇప్పటివరకు రూ.247 కోట్ల ప్రజల సొమ్మును రక్షించగలిగామని, 1930 హెల్ప్‌లైన్, సైబర్ వార్ రూమ్‌ల ద్వారా వేగవంతమైన స్పందన అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సేవల స్పందన సమయం 30 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపుకు తగ్గిందని, స్పందన రేటు 97.47 శాతానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. ఫోరెన్సిక్ విభాగంలో 7,793 కేసులకు విశ్లేషణ పూర్తి చేసినట్లు తెలిపారు.

పోలీసు సంక్షేమంలో భాగంగా 6,000 నియామకాలు, పదోన్నతులు, స్టైపెండ్ పెంపు వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జైళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విపత్తు నిర్వహణలో 26 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయం, డ్రోన్ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో ప్రాణనష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. మొత్తం మీద రాష్ట్రాన్ని మరింత సురక్షిత, సాంకేతిక ఆధారిత పాలన వైపు తీసుకెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు.