Let's talk: editor@tmv.in
రెన్యూ ప్రాజెక్టులపై క్రెడిట్ వార్.. కూటమి సర్కార్‌పై వైకాపా ధ్వజం

రెన్యూ ప్రాజెక్టులపై క్రెడిట్ వార్.. కూటమి సర్కార్‌పై వైకాపా ధ్వజం

Panthagani Anusha
24 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన (రెన్యూ ఎనర్జీ) ప్రాజెక్టుల విషయంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైకాపా హయాంలో కుదిరిన ఒప్పందాలను చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఆ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. గురువారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూతా శివ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

పాత ప్రాజెక్టులకు కొత్త రంగు: పూతా శివ శంకర్

గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని శివ శంకర్ గుర్తుచేశారు. 2023లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సుమారు రూ. 97,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రెన్యూ ప్రాజెక్టుల కోసం అప్పట్లోనే భూములు కేటాయించామని ఆయన తెలిపారు. 2023, 2024 నాటికే విండ్, పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ అయ్యాయని పేర్కొన్నారు.

రెన్యూ సంస్థ సీఈఓ సుమంత్ సిన్హా గతంలోనే వైఎస్ జగన్ సహకారాన్ని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాత ఉత్తర్వులను రద్దు చేసి అవే నిబంధనలతో మళ్లీ అనుమతులు ఇచ్చి కొత్త ప్రాజెక్టులుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. ఇది ముమ్మాటికీ క్రెడిట్ దొంగతనమే అని ఆయన విమర్శించారు.

పూడి శ్రీహరి అరెస్టుపై వైకాపా నిప్పులు

మరోవైపు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం నుంచి తిరిగి వస్తున్న శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు అడ్డుకుని ఆయన ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా బలవంతంగా తరలించారని ఆరోపించారు.

అనంతరం శ్రీహరి నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. పార్టీ ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా గంటల తరబడి తనిఖీలు చేయడంపై నేతలు మండిపడ్డారు.

ప్రతీకార రాజకీయాలు సాగుతున్నాయి: లేళ్ల అప్పిరెడ్డి

శ్రీహరి అరెస్టును వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పౌర హక్కులపై జరుగుతున్న దాడి అని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షమే లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కనీసం పోలీసులు తమ గుర్తింపును వెల్లడించకుండా ఏ కారణంతో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా వ్యవహరించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.