Let's talk: editor@tmv.in
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జగన్‌కే: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జగన్‌కే: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Gaddamidi Naveen
5 జులై, 2026

కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పాటు కానున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన క్రెడిట్ పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ కృషిని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. కడపలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వేగం వచ్చిందన్నారు.

జేఎస్‌డబ్ల్యూ సంస్థతో స్వయంగా చర్చలు జరిపి పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చారని, 2022లో ప్రత్యేక ప్రోత్సాహకాలతో జీవో నెం.87 జారీ చేసి ఎస్‌జీఎస్‌టీ మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, పన్ను సడలింపులు కల్పించారని చెప్పారు. పర్యావరణ అనుమతులు, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫ్‌ఈ), గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు వంటి కీలక నిర్ణయాలన్నీ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం 3,300 ఎకరాల్లో తొలి దశగా 1,100 ఎకరాలు జేఎస్‌డబ్ల్యూకు కేటాయించామని, అందులో సుమారు 640 ఎకరాల భూసేకరణ పూర్తిచేశామని తెలిపారు. జాతీయ రహదారి నుంచి ప్లాంట్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, పనులను కూడా ప్రారంభించామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుకు చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ చేసిన సోషల్ మీడియా పోస్టులో గత ప్రభుత్వం అందించిన సహకారం, అనుమతుల వల్లే ప్రాజెక్టు ముందుకు సాగుతోందని స్పష్టంగా పేర్కొనడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.

2018 ఎన్నికలకు ముందు కూడా ఏ సంస్థ నిర్మిస్తుందో తెలియకుండానే చంద్రబాబు ఉక్కు పరిశ్రమ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని, ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన కంపెనీని తన ఘనతగా చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అదే విధంగా జమ్మలమడుగు సభలో అభివృద్ధి అంశాల కంటే జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అవినాష్ రెడ్డి, గతంలో వైఎస్సార్ కుటుంబం అందించిన సహాయాన్ని మరచి విమర్శలు చేయడం సరికాదన్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, భవిష్యత్తులో మళ్లీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, గండికోట, చిత్ర రిజర్వాయర్ల అభివృద్ధి, కృష్ణా జలాల వినియోగం వంటి అంశాల్లో వైఎస్సార్, వైఎస్ జగన్ ప్రభుత్వాలే కీలక పాత్ర పోషించాయని పేర్కొన్న అవినాష్ రెడ్డి, ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా గత ప్రభుత్వ కృషిని ఎవరూ చెరపలేరని ఆయ‌న అన్నారు.

ట్యాగ్‌లు
KadapaSteelPlantJSWSteelYSJaganYSAvinashReddyKadapaRayalaseemaAndhraPradeshAPPolitics
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జగన్‌కే: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి - Tholi Paluku