Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా ఐసీయూ సేవలకు ఒకే ప్రమాణాలు రూపొందించండి: సుప్రీం

దేశవ్యాప్తంగా ఐసీయూ సేవలకు ఒకే ప్రమాణాలు రూపొందించండి: సుప్రీం

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) సేవలను మెరుగుపరచడానికి కీలక ఆదేశాలు జారీ చేస్తూ సుప్రీం కోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఐసీయూ సేవల అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అనుసరించేలా వాస్తవిక, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహ్‌సనుద్దీన్‌ అమానుల్లాహ్‌, ఆర్‌‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్, ఐసీయూ సేవల నిర్వహణకు అవసరమైన కనీస ప్రమాణాలపై ఇప్పటికే రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, యూటీలతో పంచుకోవాలని పేర్కొంది.

ఏప్రిల్ 20న ఇచ్చిన ఉత్తర్వుల్లో, రాష్ట్రాల ఆరోగ్య, వైద్య విద్య విభాగాలను పర్యవేక్షించే అదనపు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తక్షణమే నిపుణులతో సమావేశం నిర్వహించి, అమలు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ ప్రణాళిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. మొదటగా ఐదు ముఖ్య అంశాలను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు సూచించింది. ముఖ్యంగా మానవ వనరులు (డాక్టర్లు, నర్సులు) పరికరాలు, లాజిస్టిక్స్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కనీస అవసరాలను నిర్ణయించాలని తెలిపింది. అమలు విధానం మాత్రమే కాకుండా, పర్యవేక్షణ, అమలు విధానాన్ని పరిశీలించడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభమై, ఒక వారంలో మొదటి సమావేశం జరగాలని పేర్కొంది.

ప్రతి రాష్ట్రం తయారు చేసిన నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖకు పంపాలని, అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు పంచి, తుది సాధారణ ప్రణాళిక రూపొందించాలని సూచించింది. మొత్తం ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 18కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విచారణలో సూచించింది. దీనిని సమర్థిస్తూ కోర్టు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, పారామెడికల్‌లను కేసులో ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణలో, ఐసీయూ పరిస్థితులను సమర్థంగా నిర్వహించగల సిబ్బందిని తయారు చేయడానికి కోర్సులు, శిక్షణ విధానాలను ఎలా మెరుగుపరుస్తారో వివరించాలని సంబంధిత సంస్థలకు ఆదేశించింది.