
ప్రాణాలకు తెగించి ఆటో డ్రైవర్ సాహసం.. అభినందించిన సీపీ సజ్జనార్
నగరంలో నేరాలను అరికట్టడంలో సామాన్య పౌరులు కూడా భాగస్వాములు కావాలని నిరూపిస్తూ, ఒక ఆటో డ్రైవర్ సాహసోపేతమైన ప్రదర్శన చేశారు. బేగం బజార్ ప్రాంతంలో బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన నేరస్థుడిని తన ప్రాణాలకు తెగించి పట్టుకోవడంలో సహాయపడిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ జహీర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.
మే 4వ తేదీ తెల్లవారుజామున ఒక మహిళ తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్ వెళ్తుండగా, దబీర్‌పురాకు చెందిన ఒక రౌడీ షీటర్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ పోరాటంలో నిందితుడు తన ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో తన ఆటోలో ఆ దారి గుండా వెళ్తున్న జహీర్, మహిళ కేకలు విని సైడ్ మిర్రర్‌లో గమనించారు. అప్పటికే దాదాపు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్ళినప్పటికీ, ఏమాత్రం ఆలోచించకుండా తన ఆటోను వేగంగా రివర్స్ తీసుకువచ్చారు. నిందితుడు తప్పించుకోకుండా ఉండేందుకు తన ఆటోతో అతని బైక్‌ను బలంగా ఢీకొట్టారు. ఆ సమయంలో నేరస్థుడు చెక్క దుంగతో దాడి చేసినప్పటికీ, జహీర్ వెనక్కి తగ్గకుండా అతడిని గట్టిగా పట్టుకున్నారు. వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసు బృందం అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
ఈ సాహసం చేసిన తర్వాత జహీర్ ఎలాంటి క్రెడిట్ లేదా బహుమతి ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, బాధితురాలు ఆటో డ్రైవర్ చేసిన సాయం గురించి పోలీసులకు వివరించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జహీర్ చేసిన సాహసం స్పష్టంగా కనిపించింది. టెక్నికల్ సర్వైలెన్స్ ద్వారా ఆటో నంబర్‌ను గుర్తించి, జహీర్‌ను వెతికి పట్టుకున్నారు.
కమిషనర్ సజ్జనార్ ప్రశంసలు
మంగళవారం కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జహీర్‌ను సన్మానించి, ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. చాలామంది నేరాలు జరుగుతున్నప్పుడు ప్రేక్షకులుగా ఉండిపోతారు. కానీ జహీర్ తన ప్రాణాలను పణంగా పెట్టి 'సిటిజన్ పోలీస్' స్పూర్తిని చాటారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరుల వల్లే నేరస్థుల్లో భయం కలుగుతుందని కొనియాడారు. నిందితుడు దబీర్‌పురాకు చెందిన రౌడీ షీటర్ అని, అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరాలను అరికట్టడానికి ప్రజలు కూడా డయల్ 100 ద్వారా పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.
