Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో అవినీతి పెరిగింది: స్మృతి ఇరానీ

బెంగాల్‌లో అవినీతి పెరిగింది: స్మృతి ఇరానీ

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ‘త్రినమూల్ సంస్కృతి’గా పేర్కొన్నారు. కొల్‌కత్తాలో మీడియాతో మాట్లాడిన ఇరానీ, ఆర్జీకర్‌‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి ఘటన వంటి సంఘటనలు బెంగాల్ సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. మహిళలు రాత్రిళ్లు బయటకు వెళ్లకూడదని సీఎం చెప్పడం, న్యాయమూర్తులను ఒత్తిడికి గురిచేయడం, వరద బాధితుల నిధులను దుర్వినియోగం చేయడం, ఇవి బెంగాల్ సంస్కృతి కాదు, త్రినమూల్ సంస్కృతి అని అన్నారు.

లంచాలు ఎందుకు తీసుకున్నారు?

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి, అస్తవ్యస్థ పాలన అంటూ ఆరోపణలు చేస్తూ, పలు అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లంచాలు ఎందుకు తీసుకున్నారు? కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? అని ప్రశ్నించారు. మాల్దా శ్మశానవాటికలో రూ.50 లక్షల మోసం, టీఎంసీ నేతల ఇళ్లలో నగదు స్వాధీనం, సందేశ్‌ఖలి ఘటనలో నిందితులకు రక్షణ,ఇలాంటి అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీ కార్ కేసులో బాధితురాలికి న్యాయం ఎందుకు జరగలేదు? అని ప్రశ్నించారు.

కేంద్ర బలగాల మోహరింపు

ఎన్నికల సమయంలో భద్రతా బలగాల మోహరింపుపై మాట్లాడుతూ, కేంద్రం ప్రజలు భయపడకుండా ఓటు వేయడానికి చర్యలు తీసుకుందని అన్నారు. ఓటర్లు భయంలేకుండా పోలింగ్ కేంద్రాలకు రావడం సీఎం బాధ్యత. అలాంటి పరిస్థితిని ఎందుకు స్వాగతించడంలేదు? అని ప్రశ్నించారు. మొదటి దశ పోలింగ్ తర్వాత టీఎంసీ నాయకులే తాము తక్కువ సీట్లు గెలుస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. వాళ్లే ఓటమి అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి వర్సెస్‌ ఆరోపణలు

బీజేపీ అభివృద్ధి అంశాలపై మాట్లాడుతుంటే, టీఎంసీ వాతావరణాన్ని దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు నిజంగా ఎవరు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో గ్రహిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతపై మాట్లాడుతూ, నారీ శక్తి వందన్‌ అధినియమ్ చట్టాన్ని గురించి ప్రస్తావించారు. ఈ చట్టాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేయాలనే లక్ష్యంతో ఉందని తెలిపారు.