
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లు ప్రతుల దహనం
డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ గురువారం బిల్లు ప్రతిని దహనం చేసి దీనిని ‘బ్లాక్ లా’గా అభివర్ణించారు. ఈ బిల్లు తమిళ ప్రజలను తమ స్వంత నేలలోనే శరణార్థులుగా మార్చే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ప్రారంభానికి కొన్ని గంటల ముందు నామక్కల్‌లో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ నల్ల జెండా ఎగరేసి డీలిమిటేషన్ బిల్లు ప్రతిని తగలబెట్టారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం ఆయన ప్రస్తుతం పశ్చిమ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌తో పాటు పార్టీ నాయకులు ‘మనమంతా కలిసి పోరాడి గెలుద్దాం’ వంటి నినాదాలు చేశారు.
స్టాలిన్ బిల్లును దహనం చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే నాయకులు, కార్యకర్తలు కూడా తమ తమ ప్రాంతాల్లో బిల్లుపై ప్రతులను తగలబెట్టారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మధురైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అదే విధంగా బిల్లు ప్రతిని దహనం చేశారు. ఉధయనిధి మాట్లాడుతూ డీలిమిటేషన్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజకీయ ప్రతినిధిత్వాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్న ఆయుధంగా అభివర్ణించారు. కేంద్రం ఉత్తర రాష్ట్రాల సహాయంతో తమకు నచ్చిన విధంగా నిర్ణయాలు అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ రాష్ట్రాల పార్లమెంటరీ ప్రతినిధిత్వాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తమిళనాడు భూమి బీజేపీ అహంకారానికి తలవంచదు. హక్కుల కోసం వెలిగించిన ఈ అగ్ని దేశమంతా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ వద్ద పార్టీ నేతలు ఆర్.ఎస్.భారతి, టీకేఎస్. ఎలంగోవన్ నేతృత్వంలో కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి బిల్లు ప్రతులను దహనం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే.సెల్వపెరుతగై సేలంలో నల్లజెండా ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే ద్రవిడర్ కళగం అధినేత కే.వీరమణి కూడా బిల్లు ప్రతిని దహనం చేశారు. ఈ నిరసనలకు డీఎంకే మిత్రపక్షాలు అయిన సీపీఐ, సీపీఎం కూడా మద్దతు తెలిపాయి.
కేంద్రాన్ని వెనక్కి తగ్గేలా చేద్దాం
ఒక ప్రకటనలో స్టాలిన్ మాట్లాడుతూ, “ఈ బ్లాక్ లా కు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన జ్వాలలు తమిళనాడు అంతటా వ్యాపించాలి. 1960లలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎలా ఢిల్లీని కదిలించిందో, ఇదీ అలాగే కేంద్రాన్ని వెనక్కి తగ్గేలా చేస్తుందని అన్నారు. స్టాలిన్ నల్ల జెండా ఎగరేసిన వెంటనే ఆయన పార్టీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు తమ ఇళ్లలో, పార్టీ కార్యాలయాల్లో, ప్రజా ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో కూడా నల్ల జెండా ఎగురవేశారు. అదే సమయంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డీఎంకే అభ్యర్థులు నల్లచొక్కాలు ధరించి ప్రచారం చేశారు. చెన్నైలోని చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉధయనిధి స్టాలిన్ కూడా నల్లచొక్కా ధరించి ప్రచారం నిర్వహించారు. ఉధయనిధి మాట్లాడుతూ ప్రస్తుతం తమిళనాడుకు 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన సరైన డీలిమిటేషన్ జరిగితే 59 స్థానాలు రావాలని, అయితే కేంద్రం 47 స్థానాలకే పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. దీంతో రాష్ట్రానికి 12 స్థానాలు తగ్గే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
