
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు అవసరం:మంత్రి సత్య కుమార్ యాదవ్
రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా, పోలీస్, ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కాగా గురువారం మంత్రాలయం వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో సహా వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో రోడ్డు భద్రతా చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు 'గోల్డెన్ అవర్' (మొదటి గంట)లో అందించే వైద్యం అత్యంత కీలకమని ఆ సమయంలో బాధితులకు తక్షణ చికిత్స అందేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం రక్ష (రాహత్) పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యం అందుతుందని ఇది కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఒకవేళ చికిత్స ఖర్చు రూ. 1.5 లక్షలు దాటితే అదనపు వ్యయాన్ని 'ఎన్టీఆర్ వైద్య సేవ' ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 656 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలులో ఉండగా, త్వరలోనే ఈ సేవలను 1,500 ఆసుపత్రులకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
సమాజంలో మానవత్వాన్ని పెంపొందించే దిశగా, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితుల సమాచారాన్ని అందించే వారికి ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని మంత్రి ప్రకటించారు. ఇలా సాయం చేసే 'గుడ్ సమారిటన్'లను పోలీసులు గానీ, ఇతర విచారణ సంస్థలు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించబోవని వారికి పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో వైద్యం అందేలా చేయడమే ఈ ప్రోత్సాహక పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల గణాంకాలను విశ్లేషించిన మంత్రి రోజుకు సగటున 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా శాఖ నివేదికల ప్రకారం 79 శాతం ప్రమాదాలు అతివేగం వల్లే జరుగుతున్నాయని, మొత్తం ప్రమాదాలలో 82 శాతం మానవ తప్పిదాలే కారణమని ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన వైద్యం అందితే మరణాలను 50 శాతం వరకు తగ్గించవచ్చని అధికారులకు సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వల్ల సకాలంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, 2024లో 23,810 మందికి మాత్రమే గోల్డెన్ అవర్‌లో చికిత్స అందగా, 2026లో ఇప్పటివరకు జరిగిన 19,278 కేసుల్లో ఏకంగా 18,558 మందికి తక్షణ వైద్యం అంది ప్రాణాలు కాపాడగలిగామని గణాంకాలు వెల్లడించాయి.
అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 'హిట్ అండ్ రన్' కేసుల్లో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.2.5 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. ఇక ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
