

కరాచీలో వంటగ్యాస్ కష్టాలు.. బెలూన్లలో నిల్వ!
పొయ్యి వెలిగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆకలి తీర్చుకోవాలంటే మృత్యువుతో చెలగాటం ఆడాల్సిందే. పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రస్తుతం ఇలాంటి భీకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. తీవ్రమైన గ్యాస్ కొరత, లోడ్ షెడ్డింగ్‌తో విసిగిపోయిన జనం.. గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బెలూన్లను ఆశ్రయిస్తూ తమ ఇళ్లను పేలుడు పదార్థాల గిడ్డంగులుగా మార్చుకుంటున్నారు.
గ్యాస్ కోసం ప్లాస్టిక్ బెలూన్లు!
నగరంలోని ఓరంగీ టౌన్, మోమినాబాద్ వంటి ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా మరీ అధ్వానంగా తయారైంది. రోజంతా సరఫరా నిలిచిపోయి, కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే గ్యాస్ వస్తుండటంతో స్థానికులు వినూత్న మార్గాన్ని వెతుక్కున్నారు. మార్కెట్లో లభించే భారీ ప్లాస్టిక్ బెలూన్లను కొనుగోలు చేసి, వాటిని గ్యాస్ పైపులకు అనుసంధానిస్తున్నారు. గ్యాస్ వచ్చే కొద్ది సమయంలోనే ఈ బెలూన్లను నింపి, ఆ తర్వాత రోజంతా వంట కోసం వాడుకుంటున్నారు. ఒక్కో బెలూన్ సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.
అడుగుడుగునా ముప్పే!
ఈ బెలూన్ల వినియోగంపై భద్రతా నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో గ్యాస్ నింపడం అంటే మొబైల్ బాంబులను ఇంట్లో ఉంచుకోవడమేనని వారు అభివర్ణిస్తున్నారు. ఈ బెలూన్లకు స్వల్ప రాపిడి తగిలినా, చిన్న రంధ్రం పడినా గ్యాస్ మొత్తం లీకై క్షణాల్లో మంటలు వ్యాపిస్తాయి. ఇరుకైన గదుల్లో ఉష్ణోగ్రత పెరిగినా లేదా చిన్న నిప్పుకణిక తగిలినా భారీ పేలుడు సంభవించి ప్రాణనష్టం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే "వేరే గతి లేకే ప్రాణాలకు తెగించి ఈ పని చేస్తున్నాం" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాల సెగ
పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం ఇంతలా ముదరడానికి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాలు పాకిస్థాన్ వంటి దేశాలకు గ్యాస్ దిగుమతిని భారంగా మార్చాయి.
యంత్రాంగం మేల్కోవాలి
వార్తా సంస్థ ఏఆర్వై కథనం ప్రకారం.. గ్యాస్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాణాంతకమైన బెలూన్లు ఇళ్లలో పేలక ముందే గట్టి చర్యలు చేపట్టాలని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
