
‘టీఆర్ఎస్’ పార్టీ పేరుపై వివాదం.. కవితకు ఈసీ నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన కల్వకుంట్ల కవిత ‘టిఆర్ఎస్’ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం కీలక నోటీసులు జారీ చేసింది. కవిత ప్రతిపాదించిన పార్టీ పేరుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో పాటు వివిధ వర్గాల నుంచి ఏకంగా 1,100 కంటే ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఈసీ ఈ చర్య తీసుకుందని తెలిపింది.
కవిత తొలుత తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అనే పేరును ప్రతిపాదించారు. అయితే, గతంలో కేసీఆర్ స్థాపించి, ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారిన నాటి ‘తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)’ పేరును ఇది పోలి ఉండటంతో ఓటర్లలో అయోమయం నెలకొంటుందని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ పేరును మార్చాలని ఈసీ సూచించింది. దీంతో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కోరింది.
ఎన్నికల సంఘం సూచన మేరకు కవిత తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గా మార్చారు. ఈ మార్పుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గత ఏప్రిల్‌లోనే అధికారికంగా ఆమోదం తెలుపుతూ, ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త పేరు కొనసాగించేందుకు అనుమతించారు. అయినప్పటికీ, అసలు పేరు ప్రతిపాదనపై వచ్చిన 1,100కు పైగా ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. వీటిలో బీఆర్ఎస్ తరఫున కూడా ఫిర్యాదు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసీ తాజాగా కవితకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడైంది.
ఎన్నికల సంఘం తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని కవిత అంగీకరించేందుకు సిద్ధంగా లేరని, దీనిపై ఆమె చట్టపరంగా న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఏప్రిల్ 25న మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఏడు నెలల తర్వాత కవిత ఈ కొత్త పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ అనే పేరుపై తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, ఈ పేరు కోసం మేము జీవితాంతం కష్టపడ్డాం. 20 ఏళ్ల మా రక్తం, చెమట ధారపోసి టిఆర్ఎస్ ను విజయవంతమైన పార్టీగా మార్చాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అని ఆమె పేర్కొన్నారు. ఈ నోటీసుల వ్యవహారంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, న్యాయ ప్రక్రియ ద్వారానే దీనికి పరిష్కారం లభిస్తుందని కవిత అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
