Let's talk: editor@tmv.in
420 హామీలు నెరవేరిస్తేనే పోటీ చెయ్: సీఎంకు కేటీఆర్ సవాల్

420 హామీలు నెరవేరిస్తేనే పోటీ చెయ్: సీఎంకు కేటీఆర్ సవాల్

Panthagani Anusha
1 జూన్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతే భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ పథకాల అమలును గాలికొదిలేశారని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ తీరును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రైతులకు అందుతున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను క్రమంగా రద్దు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రత్యేక రైతు డిస్కం'ను తీసుకువస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఆలోచనను అమలు చేసేందుకే ఈ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం పైకి రైతుల ప్రయోజనాల గురించి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవానికి ఉచిత విద్యుత్ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఈ కుట్రను పట్టణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకుని రైతులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి తీవ్రమైన విద్యుత్ కోతలను గుర్తు చేస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చామని గుర్తు చేశారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో వేలాది ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘హైడ్రా’ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నగరవ్యాప్తంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టడమే కాకుండా, ఉచిత తాగునీటి పథకం, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, జీవో 58, 59 ద్వారా వేలాది మంది పేదలకు యాజమాన్య హక్కులు కల్పించామని గుర్తు చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు, రహదారుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్, ప్రస్తుతం ఎన్నికలు సమీపంలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, వైఫల్యాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జల నగేష్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.