
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
తెలంగాణలో పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే ప్రతిష్టాత్మక “ఇందిరమ్మ ఇళ్ల పథకం” అమలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మరింత అధికారాలు ఇచ్చి, బాధ్యతలను వికేంద్రీకరిస్తూ అమలు ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా కొనసాగించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను సమీక్షిస్తూ, ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలను సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హత ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ, అమలు ప్రక్రియలో వారు చురుకుగా పాల్గొనాలని మంత్రి కోరారు. ప్రతి నియోజకవర్గానికి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో ఆ ఇళ్లను ఇతర అర్హులైన వారికి కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. బేస్‌మెంట్ దశ పూర్తైన వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన చెల్లింపులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. పేదల సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.
గత ప్రభుత్వ కాలంలో నిర్మాణం పూర్తికాకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేసి, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులతో కలిపి లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య గృహాలను జీ+1 విధానంలో నిర్మించేందుకు సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూవివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర సర్వేలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా సర్వే మ్యాపుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నామని, రిజిస్ట్రేషన్ అనంతరం సర్వే నంబర్లు, భూధార్ నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు. సదా బైనామాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లకు (ఆర్డీఓలు) తుది నిర్ణయాధికారాన్ని అప్పగించినట్లు తెలిపారు. కొనుగోలుదారుడి డిక్లరేషన్ ఒక్కటే సరిపోతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు దశలవారీగా నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆధునిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, అటవీ, ఎండౌమెంట్స్, వక్ఫ్ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను సంయుక్త సర్వేలు ద్వారా పరిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా భూమి సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
