Let's talk: editor@tmv.in
గోర్ఖా సమస్యకు రాజ్యాంగబద్ధ పరిష్కారం: అమిత్ షా

గోర్ఖా సమస్యకు రాజ్యాంగబద్ధ పరిష్కారం: అమిత్ షా

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే దార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న గోర్ఖా సమస్యకు రాష్ట్రాన్ని విభజించకుండా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఉత్తర బెంగాల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని గంగారాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దార్జిలింగ్ ప్రాంతాన్ని ఎకో–అడ్వెంచర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దార్జిలింగ్ గోర్ఖా సోదరులకు నేను హామీ ఇస్తున్నాను. రాష్ట్రాన్ని విభజించకుండా రాజ్యాంగబద్ధంగా గోర్ఖా సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు.

దార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నివసించే నేపాలి భాషాభిమానులు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం ‘గోర్ఖాలాండ్’ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఉద్యమం ఎన్నోసార్లు హింసాత్మక రూపం కూడా దాల్చింది. 2011లో కొండ ప్రాంతాల పరిపాలన కోసం గోర్ఖాలాండ్‌ టెర్రిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ 2017 వరకు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ఈ ప్రాంతంలో స్థానిక గోర్ఖా రాజకీయ పార్టీలు అయిన గోర్ఖా జన్‌ముక్తి మోర్చా, గోర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్​రంట్‌ వంటి పార్టీలతో పాటు పెద్ద పార్టీలైన బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ భాగస్వామ్యాల్లో తరచూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అనిత్‌తాప నేతృత్వంలోని భారతీయ గోర్ఖా ప్రజాతంత్రిక్‌ మోర్చాతో సీట్ల భాగస్వామ్యం చేసుకుంది. దార్జిలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్ స్థానాలను ఆ పార్టీకి వదిలింది. మరోవైపు బీజేపీకి గోర్ఖా నాయకుడు బీమల్‌ గురుంగ్‌ మద్దతు ప్రకటించారు.

బాబ్రీ మసీదు తరహా మసీదు వివాదం

మాల్డా జిల్లా మణిక్చక్‌లో జరిగిన మరో సభలో అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముర్షీదాబాద్ జిల్లాలోని భారత్‌పూర్ ఎమ్మెల్యే హుమయూన్‌ కబీర్‌‌ బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అలాంటి నిర్మాణాన్ని అనుమతించదు. ఓట్ల లెక్కింపు తర్వాత ఆ కలలు చెదిరిపోతాయని అన్నారు.

రైతులకు హామీలు

పశ్చిమ బెంగాల్‌లో ఆలుగడ్డ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా షా స్పందించారు. రికార్డు స్థాయి దిగుబడి కారణంగా ధరలు తీవ్రంగా పడిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆలుగడ్డల రవాణాపై పరిమితులు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాలకు సరఫరాను సులభతరం చేసి రైతులకు మంచి ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉర బెంగాల్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రణాళికను వివరించారు.