Let's talk: editor@tmv.in
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుట్ర: ఎంపీ అసదుద్దీన్

ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుట్ర: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
10 మే, 2026

ముస్లింలను ఒక 'పథకం ప్రకారం' లక్ష్యంగా చేసుకుంటున్నారని, ద్వేషం ఆధారంగానే ఈ చర్యలు సాగుతున్నాయని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) అంశాన్ని ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ లతో ముడిపెడుతున్నారని విమర్శించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాపింగ్ తప్పనిసరని, అది చేయకపోతే తల్లిదండ్రుల పేర్లతో మ్యాపింగ్ నిర్వహిస్తారని ఓవైసీ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ధ్రువీకరణ కోసం లొకేషన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను వాడుతున్నారని ఆయన ఆరోపించారు. సుమారు 27 లక్షల పేర్ల వెరిఫికేషన్ జరిగితే, అందులో 97 శాతం ముస్లింలవే ఉన్నాయి. ఇది ముస్లింలను ఇరికించడానికి పన్నిన కుట్ర. ఈ వ్యవహారం మొత్తాన్ని మేము కోర్టు ముందు ఉంచుతామని ఆయన తెలిపారు.

నిదా ఖాన్ కేసుపై స్పందిస్తూ.. టీసీఎస్ సంస్థ ఇప్పటికే ఆమె హెచ్ఆర్ ఉద్యోగి కాదని వివరణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే ఆమె పేరును బహిర్గతం చేసి, అధికార పార్టీ మీడియా ట్రయల్ నిర్వహించిందని ఓవైసీ ఆరోపించారు. ఆమె ఇంట్లో బురఖా దొరికిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బురఖా ఉంచుకోవడం చట్టవిరుద్ధమా? మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పుస్తకాలు లేదా ఉర్దూ కవిత్వ పుస్తకాలు ఉండటంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు.

వందేమాతరం అంశంపై స్పందిస్తూ.. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ మధ్య దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని, బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన 'ఆనందమఠం' పుస్తకంలో ఇది ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగ ప్రవేశికను రూపొందించేటప్పుడు దేవుళ్ల పేర్లతో ప్రారంభించాలని సూచనలు వచ్చినా, వాటిని ఆమోదించలేదని ఆయన వివరించారు.

హైదరాబాద్‌కు చెందిన హసన్ సిద్ధిఖీని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని ఓవైసీ పేర్కొన్నారు. 1993 బాంబే పేలుళ్లు, 2008 మాలేగావ్ పేలుళ్లు, 2020 ఢిల్లీ అల్లర్ల బాధితుల పరిస్థితిని కూడా గమనించాలని ఆయన కోరారు. ఈ సమస్య కేవలం ముస్లింలది మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించినదని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుట్ర: ఎంపీ అసదుద్దీన్ - Tholi Paluku