
పెళ్లికి ముందు అంగీకారంతో శారీరక బంధం తప్పుకాదు: సుప్రీంకోర్టు
పరస్పర అంగీకారంతో ఇద్దరు పెళ్లికి ముందు (మేజర్లు) మధ్య ఏర్పడే శారీరక సంబంధం, కేవలం ఆ కారణం చేతనే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తప్పుబట్టడానికి లేదా ప్రశ్నించడానికి ఆధారం కాబోదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విడిపోయిన ఒక ప్రేమ సంబంధం కారణంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి తెలంగాణకు చెందిన గజుల తిరుపతి అనే అభ్యర్థికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది.
జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రతి ప్రేమ సంబంధం వివాహ బంధంతోనే ముగియాలని లేదు. ఒక వివాహం కాని ఇద్దరు పెద్దల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధం ఒక్కటే వారి వ్యక్తిత్వంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరచడానికి కారణం కాదని పేర్కొంది. నేటి సమాజంలో వివాహానికి ముందు సంబంధాలు సాధారణమేనని, అలాంటి సంబంధాలు చివరకు వివాహంతో ముగియకపోవడం వల్ల ఒకరు మరొకరిని మోసం చేశారని భావించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గజుల తిరుపతి దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ.. అతనికి కానిస్టేబుల్ (ఎస్‌సీటీపీసీ) ఉద్యోగ నియామకంపై పునఃసమీక్ష జరపాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.
కేసు నేపథ్యం ఏమిటి?
తెలంగాణ పోలీసు నియామక బోర్డు ద్వారా తిరుపతి కానిస్టేబుల్‌గా తాత్కాలికంగా ఎంపికయ్యారు. అయితే, అతనిపై పొరుగున ఉండే ఒక మహిళ పెట్టిన క్రిమినల్ కేసును కారణం చూపిస్తూ బోర్డు అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. సదరు మహిళ.. తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా సంబంధం పెట్టుకుని, చివరకు మరొక మహిళను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ వివాదం ఆ తర్వాత 2015 లోనే ‘లోక్ అదాలత్’ ద్వారా ఇరు పక్షాల అంగీకారంతో రాజీగా ముగిసింది. అభ్యర్థి తన అటెస్టేషన్ ఫామ్‌లో ఈ క్రిమినల్ కేసు వివరాలను ముందే నిజాయితీగా వెల్లడించారు, ఎలాంటి సమాచారాన్ని దాచలేదు. అయినప్పటికీ, స్క్రీనింగ్ కమిటీ దీనిని నైతిక అవినీతికి సంబంధించినదిగా పరిగణించి, పోలీసు ఉద్యోగానికి ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు, తిరుపతి, ఫిర్యాదుదారు ఇద్దరూ పెద్దవాళ్లేనని, నాలుగేళ్ల పాటు వారి మధ్య అంగీకారంతోనే సంబంధం సాగిందని కోర్టు పేర్కొంది. అక్కడ ఎలాంటి అత్యాచార ఆరోపణలు లేవని, లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ కూడా ఎలాంటి బెదిరింపులు లేదా ఒత్తిడితో జరిగింది కాదని స్పష్టం చేసింది.
ప్రస్తుత సమాజంలో వివాహానికి ముందే ఇలాంటి సంబంధాలు సర్వసాధారణం అయ్యాయి. పైగా, అంగీకారంతో ఇద్దరు మేజర్ల మధ్య ఉండే శారీరక సంబంధం ఆధారంగా ఒకరి క్యారెక్టర్‌పై ప్రతికూల అంచనాకు రాకూడదు. ఇద్దరు అవివాహిత వయోజనులు తమకు నచ్చిన విధంగా సంబంధాన్ని కలిగి ఉండటాన్ని దేశంలో ఏ చట్టమూ నిషేధించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఒక వ్యక్తిని మోసం చేశారా లేదా అనేది ఫిర్యాదుదారు ఇచ్చిన సాక్ష్యం ద్వారానే రుజువు అవుతుందని, కానీ ప్రస్తుత కేసులో సదరు మహిళ ఆరోపణలను ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకుని రాజీ పడిందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల, నియామక బోర్డు స్క్రీనింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని పేర్కొంటూ, తిరుపతి అభ్యర్థిత్వ రద్దును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరుపతి నియామకాన్ని పునఃపరిశీలించాలని ఆదేశిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
