
‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాంగ్రెస్ నిరంతరం బద్నాం చేస్తోందని, అయితే ప్రజలు వారి అబద్ధాలను నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించడం, నకిలీ ఓట్లను తొలగించడం, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న డూప్లికేట్, అక్రమంగా చేర్చిన పేర్లను తొలగించే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని ఆయన సమర్థించారు. తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం, బదిలీలను నవీకరించడం చిరునామా మార్పుల అప్‌డేట్ వంటి పనులు కూడా ఈ ప్రక్రియలో భాగమని తెలిపారు. తెలంగాణలో కూడా త్వరలో సర్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తారని, ఇందులో జిల్లా కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు వంటి అధికారులు భాగస్వాములవుతారని వివరించారు. ఎన్నికల సంఘం అధికారులు గ్రామాలకు వెళ్లి నేరుగా పనులు చేయరని, స్థానిక యంత్రాంగమే ఈ పనులను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సొంత ప్రభుత్వ ఉద్యోగులపై సీఎంకు నమ్మకం లేదా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముస్లిం సమావేశానికి హాజరై, ఓటర్ల జాబితా సవరణపై ఆ సమాజంలో ఉద్రిక్తతలను లేదా అనుమానాలను రేకెత్తించడానికి ప్రయత్నించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన సొంత ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగులపైనే నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై అవగాహన లేకుండానే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రక్రియపై నిఘా ఉంచే, లోపాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసే, ఫిర్యాదు చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, పౌరుడికి ఉంటుందని ఆయన తెలిపారు.
రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ దాడి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని, అందుకే కులం, మతం పేరిట విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు. బీజేపీతో పాటు ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ వంటి అత్యున్నత వ్యవస్థలపై కాంగ్రెస్ నిరంతరం విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. చివరికి విదేశాలకు వెళ్లి కూడా మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో సర్ షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో (సుమారు 36 కోట్ల మంది ఓటర్లు) ఈ ప్రక్రియను జనగణన సమన్వయంతో చేపడుతోంది. తెలంగాణలో అర్హత తేదీగా 2026 అక్టోబర్ 1ను నిర్ణయించారు.
ఈ ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమై జూన్ 24 వరకు ప్రాథమిక పనులు జరుగుతాయి. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించబడతాయి. సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం కొనసాగుతుంది. చివరగా అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాలన్నింటిలో మూడవ ఫేజ్ కింద ఈ సవరణలు జరుగుతాయని, శీతాకాల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ మూడు ప్రాంతాల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు,అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు.
