
కాంగ్రెస్ పోవాలె – కేసీఆర్ రావాలె.. మహేశ్వరం సభలో కేటీఆర్ పిలుపు
రాష్ట్రంలో కాంగ్రెస్ విధ్వంసకర పాలనతో వికాసం పోయి, విషాదం మాత్రమే మిగిలింది. ఇప్పుడు తెలంగాణ నలుదిశలా ‘కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె’ అనే నినాదమే మారుమోగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహేశ్వరంలో కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, సబితమ్మ విజయం తథ్యమని తేలిపోయిందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇటీవల హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి ఆశ్చర్యపోయారని, కేసీఆర్ దార్శనికతను దేశమంతా కొనియాడుతోందని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమే. ఆ సొమ్ముతో 1020 గురుకులాలు, 24 గంటల కరెంట్, 14 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి, రూ. 72 వేల కోట్ల రైతుబంధు అందించారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముప్పై నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల అప్పు చేసినా, ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కేసీఆర్ కిట్ పోయి కరెంట్ కోతలు వచ్చాయని, రైతుబంధు పోయి రాహుల్ బంధు వచ్చిందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీకి తెలంగాణ సొమ్మును మూటగడుతూ 72 సార్లు చక్కర్లు కొట్టారు. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం అని ఆయన పేర్కొన్నారు.
ఫార్మా సిటీపై మాట మార్చిన 'హిట్లర్ రెడ్డి'
రేవంత్ రెడ్డి తనకు హిట్లరే ఆదర్శమని ఒప్పుకున్నారని, అందుకే ఆయన పేరు ‘హిట్లర్ రెడ్డి’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 420 అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. చివరకు రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాల రైతులకు యాప్‌లో యూరియా కూడా ఇవ్వకుండా దగా చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల మంది ఉద్యోగాల కోసం, అంతర్జాతీయ ప్రమాణాలతో 14 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని తలపెడితే.. కాంగ్రెస్ నాడు రైతులను రెచ్చగొట్టిందన్నారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేసి భూములు వెనక్కి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తూ అన్నదమ్ములు భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ప్రతి బూత్‌లో అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
