
వైట్‌హౌస్ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
అమెరికాలో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ సందర్భంగా కాల్పుల ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఆ ఘటన చోటుచేసుకుందని, అలాంటి వ్యతిరేక భావనలు భారత్‌లో కూడా ఉన్నాయని ఆయన అన్నారు. నాగపూర్‌లో మీడియాతో మాట్లాడిన వడెట్టివార్, ట్రంప్ పాలన అమెరికాను నాశనం చేసిందని ఆరోపించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడం, ఇతర దేశాలపై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని విమర్శించారు. ఎలా విత్తితే అలా కోయాలి. ఎవరు ఏం చేస్తారో, దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందే అని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ, అనేక దేశాలను అస్థిరపరిచే విధంగా వ్యవహరించారని విమర్శించారు.
ట్రంప్ వ్యక్తిగత లక్ష్యాల కోసం
ప్రతి దేశంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నించడంతో పాటు, ప్రపంచాన్ని తక్కువ చేసి మాట్లాడే ధోరణి కనిపించిందని పేర్కొన్నారు. ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఇజ్రాయెల్‌తో కలిసి చేపట్టిన చర్యలే ఈ పరిస్థితులకు దారితీశాయని అన్నారు. తన వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షల కోసం ట్రంప్ అమెరికాను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. అదే విధంగా భారత్‌లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అయితే ప్రజలు ఇంకా రోడ్లపైకి రావడం లేదని అన్నారు. అయితే, దేశాధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి హింసాత్మక ఘటన జరగకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా, వడెట్టివార్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇది ప్రధాని నరేంద్రమోడీపై దాడిని సమర్థించడం లాంటిదని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో అమెరికా అధ్యక్షుడు, ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఒక భద్రతా సిబ్బంది మాత్రం గాయపడ్డారు. ఈ ఘటనతో పాటు, భారత్‌లో రాజకీయ విమర్శలు ముదిరిన పరిస్థితి కనిపిస్తోంది.
