Let's talk: editor@tmv.in
ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది: వైఎస్ షర్మిల

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది: వైఎస్ షర్మిల

Gaddamidi Naveen
24 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని బలహీనపరిచే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిసారీ ఆర్టీసీ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందని ఆమె ఆరోపించారు. గతంలో అద్దె బస్సుల విధానం నుంచి ప్రస్తుతం ఈ-బస్సుల నిర్వహణ వరకు సంస్థను క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానాలు పేద ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని షర్మిల అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఆర్టీసీని “సైలెంట్ కిల్లింగ్” చేసే దిశగా ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీసీని పరిరక్షించేందుకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు చేపడుతున్న ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

వాయు కాలుష్య నియంత్రణ పేరుతో ఆర్టీసీని బలహీనపరచకూడదని ఆమె సూచించారు. ఆధునిక సాంకేతికత కలిగిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను లీజుకు ఇచ్చే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఆర్థిక అంశాలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
APSRTCSaveRTCRTCEmployeesYSSharmilaAndhraPradeshAPPoliticsPublicTransportElectricBusesRTCPrivatizationCongressPartyAPCongressRTCJobs
ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది: వైఎస్ షర్మిల - Tholi Paluku