Let's talk: editor@tmv.in
అధికారంలో ఉండగానే దోచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది: కేటీఆర్

అధికారంలో ఉండగానే దోచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది: కేటీఆర్

Gaddamidi Naveen
29 జూన్, 2026

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, రైతులను విస్మరించి సాగునీటి ప్రాజెక్టులను పక్కన పెట్టేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. జ్వరం ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వచ్చినట్లు చెప్తూ.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స‌ర్), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కార్యకర్తలకు మార్గదర్శకాలను అందించారు.

సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ మాజీ సీఎం కేసీఆర్ అప్పులు మిగిల్చారని మాట్లాడటం ఆ పదవికే అవమానకరమన్నారు. 2014 లో కేసీఆర్ అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర అప్పు రూ. 72,000 కోట్లు ఉంటే, ఆయన పదవి నుంచి దిగేనాటికి అది రూ. 3.52 లక్షల కోట్లు అని.. అంటే పదేళ్లలో చేసిన అదనపు అప్పు రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమేనని పార్లమెంట్‌ రికార్డులను గుర్తుచేశారు. ఈ నిధులన్నింటినీ సంక్షేమ పథకాలు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, పెన్షన్ల పెంపు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కోసమే ఖర్చు చేశామని స్పష్టం చేశారు.

రైతాంగంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం

బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రైతులు యూరియా కొరతను, కరెంట్ కోతలను ఎదుర్కొంటున్నారని కేటీఆర్ గారు మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో రైతుబంధు అందింది, రుణమాఫీలు జరిగాయి. కానీ కాంగ్రెస్ నేతలు రూ. 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులు, కూలీలకు ఆర్థిక సాయం అందిస్తామని తప్పుడు, మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పుడు రెండున్నరేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు.

తమపై మరిన్ని కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెడితే తాము అంత పెద్ద నాయకులం అవుతామని ఎద్దేవా చేశారు. 2028 లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అందుకే కాంగ్రెస్ నేతలు ఈ లోపే ఎంత దోచుకోవాలో అంత దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీసులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయ‌న హెచ్చరించారు.

దామగుండంలో ప్రతిపాదిత నేవీ రాడార్ ప్రాజెక్ట్ వల్ల 12 లక్షల చెట్లు నరికివేయాల్సి వస్తుందని నాడు బీఆర్ఎస్ భూమి ఇవ్వడానికి నిరాకరిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి భయపడి 2,900 ఎకరాల భూమిని అప్పగించేశారని ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి పేరుతో చెట్లను నరికేస్తూ, బీజేపీ-కాంగ్రెస్ కలిసి మూసీని గొంతు నులుముతున్నాయన్నారు. వికారాబాద్ పరిధిలో 10,000 ఎకరాలకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం తాము పూర్తి చేస్తే, కేసీఆర్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో కాంగ్రెస్ దానిని పక్కన పెట్టేసిందని ఆరోపించారు.

మరోవైపు పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుని తిరుగుతున్నా పట్టించుకోని స్పీకర్ ‘ధృతరాష్ట్రుడిలా’ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పోవాలి - కేసీఆర్ రావాలి అని నినాదించారు.

నియోజకవర్గంలోని మొత్తం 284 పోలింగ్ బూత్‌లలో బూత్‌కు 10 మంది చొప్పున 2,840 మందితో కమిటీలను విజయవంతంగా ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ మెంబర్‌షిప్ కార్డులే మీకు గుర్తింపు ఇస్తాయన్నారు. గులాబీ జెండాను మళ్లీ ఎగరేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
KTRKCRBRSCongressTelanganaTelanganaPoliticsRevanthReddyVikarabadFarmersRythuBandhuTelanganaNewsPoliticalNewsBreakingNewsTeluguNews
అధికారంలో ఉండగానే దోచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది: కేటీఆర్ - Tholi Paluku