Let's talk: editor@tmv.in
‘రైతు డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: కేటీఆర్

‘రైతు డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: కేటీఆర్

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వంచించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు దాటినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్‌లో భారీ రైతు సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన 'రైతు డిక్లరేషన్' రైతులకు శాపంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు నిర్వహించనున్న ఈ సభకు హాజరుకావాలన్న ఆహ్వానాన్ని ఆయన మన్నించారు. వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరతతో పాటు ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణలో గతంలో లేని విధంగా కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు, కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయని ఆయ‌న ఆరోపించారు.

పార్టీ పునర్నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలు

ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పార్టీ వ్యూహాలపై కూడా విస్తృతంగా చర్చించారు.

ఓటర్ల జాబితా సవరణ పై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, వరంగల్ జిల్లా నేతలతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ష‌ (స‌ర్) అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ ఇతర ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయించిన దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని ఆయ‌న హెచ్చరించారు. ప్రతి బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్తలను బూత్ లెవల్ అసిస్టెంట్స్ (బీఎల్ఏ) గా నియమించి, వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నగర రాజకీయాల్లో ఓటర్ల జాబితా గెలుపోటములను శాసిస్తుందని, అందుకే ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని తలసాని నేతలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని, రైతులకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.