
డీలిమిటేషన్ సాకుతో ప్రాంతీయ విద్వేషాలకు కాంగ్రెస్ కుట్ర: ఎన్. రామచందర్ రావు
దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పుంజుకోవడాన్ని సహించలేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలో ఉత్తర-దక్షిణ విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు.
దక్షిణాదిన బలపడుతున్న కమలం
దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించిందని రామచందర్ రావు గుర్తుచేశారు. 2024 ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతూ.. తెలంగాణలో 8, కర్ణాటకలో 17, కేరళలో 1, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుందని పేర్కొన్నారు. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీఎస్, జనసేన విజయాలను కలిపితే దక్షిణాదిన ఎన్డీయే బలం గణనీయంగా పెరిగిందని, దీన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు.
స్టాలిన్ తీరుపై ఆగ్రహం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లు కాపీని తగులబెట్టడాన్ని రామచందర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని నల్ల చట్టంగా అభివర్ణించడం ద్వారా స్టాలిన్ మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 55 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునర్విభజనలోని లోపాలను సరిదిద్దలేదని, ఇప్పుడు బీజేపీపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత స్థానాలను 50 శాతం మేర పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీనివల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
రేవంత్ 'హైబ్రిడ్ మోడల్' సాధ్యం కాదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' పద్ధతి ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని రామచందర్ రావు కొట్టిపారేశారు. సగం సీట్లు జనాభా ప్రకారం, మిగిలిన సగం రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి ఆధారంగా కేటాయించాలన్న ప్రతిపాదన వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి ఫార్ములా ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది ధనిక రాష్ట్రాలు-పేద రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విడగొట్టేలా ఉందంటూ మండిపడ్డారు. ఈ ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా, ప్రజల మధ్య విభజన తెచ్చేలా ఉందని ఆయన విమర్శించారు.
కులగణన ఒక 'బోగస్' సర్వే
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే రిపోర్టుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనకే రాజ్యాంగబద్ధత ఉంటుందని తేల్చిచెప్పారు. సర్వే సిబ్బంది చాలా ఇళ్లకు వెళ్లకుండానే నివేదికలు సిద్ధం చేశారని, ఇది పూర్తిగా బోగస్ అని ఆరోపించారు. ఈ సర్వేలో ముస్లింలను బీసీల్లో చేర్చడం ద్వారా అసలైన బీసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
