


కాంగ్రెస్ రాజకీయాల నేరీకరణకు పర్యాయపదంగా మారుతోంది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అవినీతితో పాటు రాజకీయాలను నేరీకరణకు కూడా పర్యాయపదంగా మారుతోందని మండిపడ్డారు. తెలంగాణలో తన మూడు రోజుల పర్యటన ముగింపు రోజైన మంగళవారం హైదరాబాద్ శివార్లలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఈ దోపిడీని నిలదీస్తారని హెచ్చరించారు.
సమావేశంలో నితిన్ నబీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే అవినీతి అని అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయాల నేరీకరణ కూడా కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారుతోంది. దుష్ట ఉద్దేశాలతో దేశాన్ని విభజించాలనుకునే శక్తులకు కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ఇస్తున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో ఈ ఘనమైన పాత పార్టీ అవినీతి, నేరపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందడం ఖాయం అని దుయ్యబట్టారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్‌టీని సరళీకృతం చేసి, ఆదాయపు పన్నును తగ్గించి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిందని నితిన్ గుర్తుచేశారు. కానీ, తెలంగాణలోని అధికార కాంగ్రెస్ మాత్రం ఇక్కడ వసూలు చేస్తున్న "ఆర్ఆర్ ట్యాక్స్" (రాహుల్ గాంధీ - రేవంత్ రెడ్డి ట్యాక్స్) ద్వారా నిధులను 'ఢిల్లీ దర్బార్'కు మూటగడుతోందని ఆరోపించారు. తమ పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతో ఒక పెద్ద 'లూఠీ బజార్' (దోపిడీ) కి తెరలేపింది. ప్రజల కష్టార్జితాన్ని లూఠీ చేసి, రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు పెడుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రజల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.. మీ ప్రతి పైసా వసూలుకు ప్రజలు మిమ్మల్ని బాధ్యులను చేస్తారని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ ఆనాటి స్వాతంత్ర్య పార్టీ 1947లోనే 'సమాధి' అయిపోయిందని విమర్శించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రయోజనాలతో ఎలా రాజీపడ్డారో చరిత్ర గుర్తుంచుకుంటుందని, కాంగ్రెస్ ది 'రాజీ రాజకీయాల' చరిత్ర అయితే, బీజేపీది 'జాతీయవాద' నిబద్ధత అని స్పష్టం చేశారు.
త్రిలింగ భూమిపై కమల వికాసం
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి ఆడుతున్న రాజకీయ క్రీడపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు బీసీ కేటగిరీ కింద కల్పిస్తున్న మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అధికారంలోకి రాగానే పూర్తిగా రద్దు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఆ రిజర్వేషన్ల ఫలాలను అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకే అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను "కాంగ్రెస్ ముక్త్" రాష్ట్రంగా మార్చాలని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో కమలం ఎలా విస్తరించిందో, అదే విధంగా "త్రిలింగ" భూమిగా పేర్కొన్న తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా బీజేపీ విజయపతాకం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వంగ భూమి (పశ్చిమ బెంగాల్), కళింగ భూమి (ఒడిశా) లలో కమలం ఎలాగైతే వికసించి ముందుకు సాగిందో.. అదే విధంగా 'త్రిలింగ' గడ్డ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా కమల వైభవాన్ని, బీజేపీ జెండాను త్వరలోనే చూస్తామని నాకు పూర్తి నమ్మకం ఉందని నితిన్ నబీన్ పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొంటూ, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లినా వెనకడుగు వేయకుండా పోరాడి బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. కేవలం కాంగ్రెస్ బలహీనతలే కాకుండా, గత 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో దేశం సాధించిన అద్భుత ప్రగతి, విజయాలే రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రధాన అజెండా కానున్నాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు.
