

కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక"లో భాగంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ప్రారంభమైన మూడు రోజుల "రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి “భూభారతి” వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.
మే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్న రైతు మేళాలో రైతులకు అవసరమైన యాంత్రిక పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతు మేళా వేదికగా భూసార పరీక్షలు నిర్వహించిన అధికారులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరిగితే దిగుబడులు మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీల మేరకు ప్రజాపాలన సాగుతోందని మంత్రి తెలిపారు.
సీబీఐ విచారణ డిమాండ్
రాజకీయ అంశాలపై స్పందించిన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడకుండా కేవలం అధికారంలోకి తిరిగి వస్తామనే ఆశతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని కమిషన్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి నివేదిక అందజేసి తొమ్మిది నెలలు గడిచినా చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ లాలూచి లేకపోతే వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
