Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ ‘ఇందిరమ్మ రాజ్యం’ ప్రతి ఇంటికీ సంక్షోభం తెచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ ‘ఇందిరమ్మ రాజ్యం’ ప్రతి ఇంటికీ సంక్షోభం తెచ్చింది: కేటీఆర్

Gaddamidi Naveen
23 జూన్, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ రాజ్యం’ తెలంగాణను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంట కొనుగోలు విధానం ద్వారా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు సమాజానికి తీవ్ర ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల మేరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర రైతులకు ‘మరణ శాసనం’ రాశారని కేటీఆర్ మండిపడ్డారు.

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ వైఫల్యం

గతంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించినప్పుడు, రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారని.. కానీ ఈ రోజు ఆయన కూడా కేంద్రం ఆమోదించిన పరిమాణంలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని అనడం రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతికి నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాబోయే వ్యవసాయ సీజన్ నుంచి కేంద్ర కోటాకు మించి రైతుల పంటను కొనుగోలు చేస్తారనే నమ్మకం లేకుండా పోయిందని, ఇది రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రంగంలోనూ వైఫల్యాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గత ప్రభుత్వం అందించిన రైతు బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరతతో పాటు విపరీతంగా విద్యుత్ కోతలు పెరిగాయి. ప్రతిపాదిత 'ఫార్మర్స్ డిస్కాం' ద్వారా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమాజంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసింది. గత రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలు ఏంటి? చేసిన అభివృద్ధి ఏంటని ప్రజలు నిలదీయాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో దశాబ్ద కాలం పాటు సంక్షేమ పాలన సాగితే.. నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలోకి కూరుకుపోయిందని కేటీఆర్ తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినప్పటికీ, రాష్ట్రానికి ఎలాంటి చెప్పుకోదగ్గ ప్రయోజనాలు సాధించలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులను సంక్షేమం, సాగునీరు, తాగునీరు, 24 గంటల విద్యుత్ వంటి ఉత్పాదక రంగాలపై ఖర్చు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండానే భారీగా అప్పులు కూడబెడుతోందని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసి కేవలం కమీషన్లు, రాజకీయ కక్షసాధింపులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని.. ఇలాంటి వేధింపులను పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని, వచ్చే ఐదేళ్ల పాటు వారి సంక్షేమ బాధ్యత తనదేనని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పోరాడి, మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స‌ర్) కార్యక్రమంపై కేటీఆర్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్‌లు
KTRKTRamaRaoBRSBRSPartyKCRTelanganaTelanganaPoliticsRevanthReddyCongressGovernmentIndirammaRajyamFarmersIssues
కాంగ్రెస్ ‘ఇందిరమ్మ రాజ్యం’ ప్రతి ఇంటికీ సంక్షోభం తెచ్చింది: కేటీఆర్ - Tholi Paluku