
కాంగ్రెస్ ప్రభుత్వం ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’: మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అవగాహన సదస్సుకు మాజీ మంత్రి టి. హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అంకితభావాన్ని ఆయన కొనియాడారు. హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి, గౌరవెల్లి ప్రాజెక్టు, గండి మహాసముద్రం చెరువులను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని గుర్తుచేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరి ఓటును బాధ్యతగా రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పాలనపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే, రేవంత్ రెడ్డి మాత్రం మోసాలకు తెరలేపారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.
ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.2730 కోట్లు కేటాయించి కేవలం రూ.52 కోట్లు మాత్రమే జీతాలు, కరెంట్ బిల్లులకు వాడారని, కేబినెట్‌లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేరని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.5403 కోట్లు కేటాయించినా ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదని, ‘దళిత బంధు’ హామీ గాలికి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.1370 కోట్లలో రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. యాదవులకు గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీని బంద్ పెట్టారని ఆరోపించారు. చేనేతన్నల బతుకమ్మ చీరలు, యూనిఫామ్ ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టి నేతన్నల పొట్టగొట్టారని, గౌడన్నలను జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు.
85 రోజులు దాటినా రైతుబంధు దిక్కులేదని, రైతుబీమాను ఐదు నెలలుగా ఆపేశారని హరీష్ రావు విమర్శించారు. వడ్లకు తరుగు పేరిట మోసం చేస్తూ, కేవలం ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామనడం రైతులను వంచించడమేనన్నారు. రేవంత్ రెడ్డిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్. గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నారు. బడా కాంట్రాక్టర్ల బిల్లుల కోసమే నిధులు మళ్లిస్తున్నారని ఆయన తెలిపారు.
ఖజానాలో డబ్బులు లేవంటూనే సీఎం తన క్యాంప్ ఆఫీస్, ఇనుప కంచెలకు కోట్ల రూపాయలు తగలేస్తున్నారని దుయ్యబట్టారు. మోరీలు బాగుచేయడం చేతకాని వాడు రూ.1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పేరిట కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై మంత్రులు స్పందించకపోవడాన్ని నిలదీశారు. తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పుకునే రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్ పట్టిన గతే పడుతుందని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నిషేధిస్తారని హరీష్ రావు హెచ్చరించారు.
