Let's talk: editor@tmv.in
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్‌‌రావు
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్‌‌రావు

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్‌‌రావు

Gaddamidi Naveen
10 మే, 2026

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధాన్యం కొనుగోళ్లపై కనీస పట్టింపు లేదని మాజీ మంత్రి హరీష్‌‌రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, 40 రోజులుగా వేచి చూస్తున్న రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీష్‌‌రావు మాట్లాడుతూ, మిల్లుల వద్ద తరుగు, బీ-గ్రేడ్ పేరుతో ఎకరాకు రూ. 700 నష్టపరుస్తున్నారని, వివిధ నిబంధనల పేరుతో రైతులను దోచుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వరి కోతలు ప్రారంభమయ్యే ముందే మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించి సంచులు, లారీలు, నిధులు సిద్ధం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం నెలన్నర రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

చిన్నకోడూరు ప్రాంతంలో ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల సన్‌ఫ్లవర్ దిగుబడి వస్తున్నా, కేవలం ఆరున్నర క్వింటాళ్లకే పరిమితి విధించారని, ఆ పరిమితిలోనూ కొనుగోళ్లు జరగడం లేదని ఆయ‌న తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కోటా పూర్తయిందని అధికారులు చెబుతున్నారని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. పంటల మార్పిడి చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోందని, అయితే రైతులు సన్‌ఫ్లవర్, మక్కలు, శనగలు, జొన్నలు పండిస్తే వాటిని కొనుగోలు చేయకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మక్కలకు 26 క్వింటాళ్ల పరిమితి పెట్టినా కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, సంచులు కూడా రైతులే తెచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో 40 రోజులుగా పంట కుప్పల కిందే పడి నాణ్యత దెబ్బతింటోందన్నారు. మద్దతు ధర క్వింటాలకు రూ.7,720 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.5,000 మాత్రమే ఆఫర్ చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. దీంతో రైతులు ఎకరాకు దాదాపు రూ.27 వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సిద్దిపేట మార్కెట్ యార్డులో నిల్వలు పేరుకుపోవడంతో గత నాలుగు రోజులుగా లారీలు లేక రైతుల ధాన్యం, మక్కలను లోపలికి అనుమతించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తేమ పరీక్షలు, సంచులు, కాంటా, లారీలు, మిల్లుల ప్రక్రియల కోసం రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే వేచి ఉండాల్సి వస్తోందని హరీష్‌‌రావు పేర్కొన్నారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు.

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్‌‌రావు - Tholi Paluku