
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల ‘రైతు భరోసా’ను ఎగ్గొట్టింది: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన కీలక వ్యవసాయ గ్యారంటీలను తుంగలో తొక్కి, 'రైతు భరోసా' పథకం కింద ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. మంగళవారం ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి 30 నెలల దుర్మార్గపు పాలనలో తెలంగాణ రైతాంగానికి దాదాపు రూ. 30 వేల కోట్ల రైతు భరోసా సహాయాన్ని అందకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టి, మళ్లీ ఏ మొహం పెట్టుకుని రైతుల పేరిట బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు విడతల రైతు భరోసా సాయాన్ని అందించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏటా ఎకరాకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, ఉన్న పథకాన్ని ఊడగొట్టారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతులు ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకూ గాను ముందుగా మీరు తెలంగాణ రైతు లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు.
రూ. 2 లక్షల రుణమాఫీ హామీని కూడా కాంగ్రెస్ పూర్తిగా నెరవేర్చలేదని.. రాష్ట్రంలో యూరియా కొరత, పంటల కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటనలు, పబ్లిసిటీ సభలకు ఖర్చు చేస్తున్న వందల కోట్ల నిధులను రైతులకు సాయంగా అందించి ఉంటే బాగుండేదని హితవు పలికారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న విప్లవాత్మక చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 'రైతు బంధు' పథకం ద్వారా 11 విడతల్లో ఏకంగా రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ విప్లవానికి పునాది వేశారన్నారు. గత పదేళ్ల పండగ లాంటి వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేసిందని, ఈ అన్యాయాన్ని తెలంగాణ రైతాంగం ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
