
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలం: కేటీఆర్
రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని బద్దెనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ధాన్యం కుప్పల వద్దే కూర్చుని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నెల రోజులుగా రైతులు తమ పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.
రైస్ మిల్లుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయకపోవడంతోనే కొనుగోలు ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. మిల్లులు కేటాయించకుండా ధాన్యం ఎవరు కొనాలి? తూకం ఎలా వేయాలి? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లను కావాలనే ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తూ లాభపడుతుంటే ప్రభుత్వం మాత్రం రైతులను గాలికొదిలేసిందని పేర్కొన్నారు.
జిల్లాలో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్లలో ఇప్పటివరకు కనీసం వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కూడా కొనలేదని అధికారులే స్వయంగా ఒప్పుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. అకాల వర్షాల భయంతో రైతులు తమ సొంత ఖర్చులతో టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో 'రైతు ప్రభుత్వం' అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో ఇంత దారుణమైన పాలనను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. తాను స్వయంగా కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పటికీ బాధ్యత గల ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంటాలు ఏర్పాటు చేయాలని వెంటనే రైస్ మిల్లులను కేటాయించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదేవిధంగా రూ.500 బోనస్‌తో కలిపి కనీస మద్దతు ధరను రూ.2,350గా నిర్ణయించి రైతులకు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇక మరో రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
