
వరి కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రస్తుత రబీ సీజన్‌లో వరి కొనుగోళ్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తన చేతగానితనాన్ని, వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.
ఒప్పందాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ నుంచి దాదాపు 53 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) వరిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందే అంగీకరించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం మేరకు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కనీస బాధ్యతలను నెరవేర్చకుండా కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీతో పాటు గతంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కూడా రైతుల జీవితాలతో చెలగాటమాడాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు – మధ్యవర్తుల దోపిడీ
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పంట తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే మరోవైపు దీనిని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు తక్కువ ధరలకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో మార్కెట్ యార్డులను సందర్శించి ఒత్తిడి తెచ్చిన తర్వాతే ప్రభుత్వం కొద్దిగా స్పందించిందని ఆయన వెల్లడించారు.
సన్నబియ్యం పంపిణీలో భారీ మోసం
ఇదిలా ఉండగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా తెలంగాణ ప్రజలకు నాసిరకం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తెప్పించి ఇక్కడి పేదలకు ఇస్తున్నారని అదే సమయంలో తెలంగాణలో పండే నాణ్యమైన సన్నబియ్యాన్ని మాత్రం అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను వంచించే ఈ కుంభకోణం గత బీఆర్ఎస్ హయాం నుంచే ప్రారంభమై ఇప్పుడు కూడా కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
ఇక వరి కొనుగోళ్లకు కనీస అవసరమైన గోనె సంచులను కూడా సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు డిమాండ్ ఉన్న కొత్త వంగడాల విత్తనాలను సకాలంలో సరఫరా చేయడంలోనూ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో పండే దొడ్డు రకం బియ్యానికి మార్కెట్ లేకపోయినా ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దొడ్డు రకం బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు.
కమిషన్లు, కాంట్రాక్టులపైనే కాంగ్రెస్ దృష్టి
రైతుల సంక్షేమాన్ని వరి కొనుగోళ్లను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్లు, కాంట్రాక్టులు, భూముల వేలం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. విదేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే పురుగుమందుల రహిత సేంద్రీయ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పలుమార్లు అవగాహన కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల్లో ఎలాంటి చైతన్యం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.
అయితే ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచా రంలో హామీ ఇచ్చిన విధంగా 10 రకాల పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే తెలంగాణ రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రం నుంచి కేంద్రం కొనుగోలు చేసే ధాన్యపు కోటాను మరింత పెంచేందుకు అవసరమైతే తాను వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
