
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
అండమాన్ నికోబార్ దీవుల్లోని ‘గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ చుట్టూ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఈ దీవుల్లో పర్యటించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ‘డ్యామేజ్ కంట్రోల్’ (నష్టనివారణ) చర్యలకు దిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ భారీ ప్రాజెక్టుపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరగాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పర్యావరణం, గిరిజన హక్కులు, పారదర్శకత, భద్రతపై ప్రభుత్వం ఇస్తున్న వివరణలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని మండిపడ్డారు. గలాథియా బే ఈ ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనదని, ఇక్కడ అరుదైన పగడపు దిబ్బలు, అంతరించిపోతున్న 'జెయింట్ లెదర్‌బ్యాక్' తాబేళ్ల ప్రధాన సంతానోత్పత్తి కేంద్రం ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం కేవలం తక్కువ భూమినే వాడుతున్నామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. నికోబారీలు, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన 'షోంపెన్' తెగలకు ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అటవీ భూముల మళ్లింపునకు నికోబారీలు ఇచ్చిన అంగీకారాన్ని వెనక్కి తీసుకున్నారని, వారిపై ఒత్తిడి తెచ్చి అనుమతులు పొందారని ఆరోపించింది.
పర్యావరణ అనుమతుల ప్రక్రియలో 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (ప్రయోజనాల సంఘర్షణ) ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రాజెక్టును విమర్శించిన స్వతంత్ర సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం పారదర్శకతకు విరుద్ధమని పేర్కొంది. అలాగే, ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం (ఏడాదికి 10 మిలియన్ల ప్రయాణికులు) వాస్తవ అవసరాలకు మించి ఉందని, గణాంకాలను పెంచి చూపుతున్నారని విమర్శించింది.
జాతీయ భద్రత, అభివృద్ధి
ఈ ప్రాజెక్టును జాతీయ భద్రతతో ముడిపెట్టడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. టౌన్‌షిప్, పర్యాటక మౌలిక సదుపాయాలు, ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ వంటి అభివృద్ధి ప్రణాళికలను భద్రతా అంశాల నుంచి విడిగా చూడాలని కోరింది. ప్రభుత్వం మాత్రం అండమాన్ సముద్రంలో భారత్ ఉనికిని బలోపేతం చేసేందుకు, సుస్థిర అభివృద్ధి కోసం ఇది వ్యూహాత్మక ప్రాజెక్టు అని వాదిస్తోంది. అయితే, పర్యావరణ, సామాజిక ప్రభావం ఉన్న ఇటువంటి భారీ ప్రాజెక్టుపై పార్లమెంటులో బహిరంగ చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షం పట్టుబడుతోంది.
