Let's talk: editor@tmv.in
ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం: ఎన్. రామ‌చందర్ రావు

ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం: ఎన్. రామ‌చందర్ రావు

Gaddamidi Naveen
16 జూన్, 2026

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ఇప్పటివరకు 12 సార్లు సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎస్ఐఆర్) జరిగిందని, దీనిని మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం ముమ్మాటికీ సరికాదన్నారు. 1951 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిని ఎన్నడూ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లుగా నమోదవుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సుమారు 5 నుంచి 10 వేల మంది పాకిస్తానీయులు అక్రమంగా నివసిస్తున్నారనే సమాచారంపై కాంగ్రెస్, ఎంఐఎం సమాధానం చెప్పాలన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని రామ‌చందర్ రావు తెలిపారు. అనర్హులైన పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కోర్టు గుర్తుచేసిందన్నారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ గెలిచిందనడం అవాస్తవమని, ఇదే ప్రక్రియ జరిగిన కేరళలో యూడీఎఫ్ గెలిచింది కదా అని ప్రశ్నించారు. గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన దుయ్యబట్టారు. 1980లో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే, ఇందిరా గాంధీ నివాసంలో ఆమె పేరు ఓటరుగా నమోదైందని ఆరోపించారు. అంతర్గత ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు, నెహ్రూకు 2 ఓట్లు వచ్చినా నెహ్రూను ప్రధానిని చేయడం ఓటు చోరీ కాదా అని ప్రశ్నించారు. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే చోరీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు.

బోగస్ ఓట్లతో గెలవడం అలవాటైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ఎస్‌ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు తొలగిపోతాయనే తీవ్ర భయానికి లోనై పెద్దగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటమే ఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యమని రామ‌చందర్ రావు తెలిపారు.