Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌, బీజేపీలది 'అపవిత్ర బంధం': బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీలది 'అపవిత్ర బంధం': బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

Gaddamidi Naveen
12 మే, 2026

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి 'గుజరాత్ మోడల్'ను ప్రశంసించడం, బీజేపీ 'వికసిత్ భారత్' విజన్‌ను సమర్థించడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య 'అపవిత్ర బంధం' ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఆదివారం కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ వారి మధ్య ఉన్న రాజకీయ అవగాహనను స్పష్టం చేస్తోందని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మద్దతు కావాలంటే నాతో కలవండి అని ప్రధాని బహిరంగంగానే చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను రాజకీయంగా బలహీనపరచాలనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమర్థిస్తున్నదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై ప్రజలకు ఇంకా స్పష్టమైన సమాధానం లభించలేదని, ప్రధాని తాజా పర్యటన రాష్ట్ర ప్రజల్లో నిరాశ మిగిల్చిందని పేర్కొన్నారు.

ఆదివారం జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సీఎం హోదాలో మోడీ గుజరాత్ మోడల్‌ను ఎలాగైతే నిర్మించారో, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ వృద్ధి సాధించి 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామ‌ని పేర్కొన్నారు. జీడీపీలో 10 శాతం వాటా అందించాలన్నదే రాష్ట్ర లక్ష్యమని వెల్లడించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ చమత్కారంగా.. "గుజరాత్‌కు ఇచ్చినంతే మీకు ఇస్తే, ఇప్పుడు మీకు అందుతున్న నిధులు సగానికి పడిపోతాయి.. అందుకే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే నాతో కలసి నడవడం మంచిది" అని వ్యాఖ్యానించారు.