
ప్రధాని ప్రసంగం తర్వాత కాంగ్రెస్‌లో ఆందోళన: ఎన్. రామచందర్ రావు
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ ముదురుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తర్వాత కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఇండియా' కూటమి అసలు రంగును ప్రధాని బట్టబయలు చేశారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు కోట్లాది మంది మహిళల ఆకాంక్షలను కాలరాశాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను రామచందర్ రావు సమర్థించారు. లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు తమ పాపాలను కడుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిని దేశంలోని 50 శాతం జనాభా క్షమించదని, ఈ అవమానాన్ని మహిళలు ఎప్పటికీ మర్చిపోరని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారు అని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 17న లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకు 298 ఓట్లు అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 2/3 వంతు మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తమ వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, కేవలం నియోజకవర్గాల పునర్విభజన కోసమేనని ఆరోపించారు. అందుకే తాము వ్యతిరేకించామని ఆమె వెల్లడించారు.
రాజకీయ పరిణామాలు
పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా, ప్రభుత్వం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయకుండా జాప్యం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా మహిళల మద్దతు ఉందని, రాబోయే రోజుల్లో దీనికి రాజకీయంగా కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రామచందర్ రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు భవిష్యత్తు, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌ది మహిళా వ్యతిరేక నైజం: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్, ఇండియా కూటమిల తీరుపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని ఎండగట్టారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును 6వ సారి ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని మరోసారి వంచించిందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు. బిల్లు వీగిపోయిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ సంబరాలు చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తర-దక్షిణ భారతదేశం అంటూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆమె ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నారీ శక్తి కోసం అమలు చేస్తున్న పథకాలను ఆమె వివరించారు. ముఖ్యంగా 'నమో డ్రోన్ దీదీ', 'లఖ్‌పతి దీదీ' మహిళలకు అందిస్తున్న 'ముద్రా రుణాలు' వంటి పథకాలు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఉంచినందుకు తెలంగాణ బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.
