Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో పథకాలన్నింటికీ ‘సమగ్ర సంక్షేమ కార్డు’: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పథకాలన్నింటికీ ‘సమగ్ర సంక్షేమ కార్డు’: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
29 మే, 2026

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ‘సమగ్ర సంక్షేమ కార్డు’ ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ ప్రభుత్వ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ ఒకే ఒక్క కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించారు.

తక్షణమే ఈ కార్డు రూపకల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తుంది. ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విశ్లేషించడం వల్ల పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన అర్హులకు ఫలాలు అంది, అనర్హులను ఏరివేయడం సులభమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పాత పద్ధతికి స్వస్తి పలికి, ఐటీ శాఖ ఆధ్వర్యంలోనే ఈ సమగ్ర కార్డు ఉండాలన్నారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ఐఏఎస్ అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కార్డులో చేర్చే ప్రధాన వివరాలు

ఈ స్మార్ట్ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల వివరాలు పొందుపరచాలని చెప్పారు. అవసరమైతే జాతీయ గుర్తింపు కార్డు తరహాలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ను ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా ఐటీ శాఖ సేకరించాలన్నారు.

ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ద్వారా విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం ఆకాంక్షించారు. ఉదాహరణకు.. రాష్ట్రంలో ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం వెంటనే 'చేయూత' పెన్షన్ డేటాబేస్‌కు చేరి, తదుపరి చర్యలు ఆటోమేటిక్‌గా మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను సైతం దీనికి లింక్ చేయాలన్నారు.

గల్ఫ్ వలసలపై ప్రత్యేక శ్రద్ధ

కేరళ ప్రభుత్వం గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగుల కోసం అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఒకే చోట ఉంచితే, అమాయక ప్రజలను మోసం చేసే అనధికార ఏజెంట్ల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.