Let's talk: editor@tmv.in
స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు సమగ్ర కార్యాచరణ అవసరం: సీఎం చంద్రబాబు

స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు సమగ్ర కార్యాచరణ అవసరం: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
18 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం చెత్త సేకరణ, ప్రాసెసింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

విశాఖ టాప్.. వెనుకబడిన జిల్లాలపై సీఎం సీరియస్

రాష్ట్రంలోని జిల్లాల వారీగా స్వచ్ఛాంధ్ర ర్యాంకులను ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. మార్చి 31 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 92 శాతం మార్కులతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విజయనగరం, గుంటూరు జిల్లాలు 85 శాతంతో తదుపరి స్థానాల్లో నిలవగా శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేర్పాటు, ఓడీఎఫ్ ప్లస్ ప్రమాణాల్లో వెనుకబడిన జిల్లాలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఈ ర్యాంకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా ఉంచేందుకు ‘థర్డ్ పార్టీ’ సంస్థల ద్వారా సర్వే నిర్వహించాలని సూచించారు.

డంపింగ్ యార్డులు ఇక పార్కులుగా

పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. గడిచిన ఏడాది కాలంలో 153 లక్షల టన్నుల చెత్తలో 114 లక్షల టన్నులను ఇప్పటికే తొలగించామని అధికారులు వివరించారు. మిగిలిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించి ఆయా డంపింగ్ యార్డులను పచ్చదనంతో కూడిన పార్కులుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాల పొలిమేరల్లో ఉండే డంపింగ్ కేంద్రాలను అందమైన గ్రీన్ స్పేస్‌లుగా అభివృద్ధి చేయాలని మార్గనిర్దేశం చేశారు. అవసరమైన చోట కొత్తగా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త నుంచి విద్యుత్) ప్లాంట్లను ప్రోత్సహించాలని తెలిపారు.

గ్రామీణ పారిశుద్ధ్యంపై నజర్

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో చెత్త సేకరణ వ్యవస్థను నూటికి నూరు శాతం పటిష్టం చేయాలన్నారు. తయారైన కంపోస్ట్‌ను విక్రయించే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించాలని సూచించారు. భూగర్భ జలాల పెంపు కోసం కమ్యూనిటీ సోక్ పిట్స్ (ఇంగుడు గుంతలు) నిర్మించాలని, ‘స్వచ్ఛ పథం’ వాహనాల ద్వారా గ్రామీణ రహదారులను నిరంతరం శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.

పర్యావరణ లక్ష్యాలు - 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 590 ఎకరాల్లో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. గ్రీన్ కవర్‌ను (పచ్చదనం) 2030 నాటికి 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సోలార్ రూఫ్ టాప్‌లు, నెట్ జీరో విధానాలను అమలు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి గోబర్‌ధన్ ప్లాంట్లు పూర్తి చేసి, వ్యర్థాల ద్వారా ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.