
పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం హిమాయత్ నగర్‌లోని టీజీటీడీసీ కార్యాలయంలో పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సుమారు రూ.274.93 కోట్ల విలువైన పర్యాటక పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు అవుతున్న పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు.
ప్రాజెక్టులు నిర్దిష్ట గడువుల్లో పూర్తయ్యేలా ప్రతి నెలా పురోగతిని సమీక్షించాలని మంత్రి తెలిపారు. సోమశిలలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచేందుకు ఆధునిక పడవలను ప్రవేశపెట్టాలని, అదనపు బోటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే రష్యా, చైనా తరహాలో ఉన్న ఎత్తైన ప్రాంతాలు, జలాశయాల వద్ద కాంటిలీవర్ గ్లాస్ వ్యూపాయింట్ల నిర్మాణంపై సాధ్యతా అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రామప్ప ఆలయం పరిసరాల్లో అదనపు కాటేజీల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఆధ్యాత్మిక, వారసత్వ, ఈకో-వెల్‌నెస్, క్రాఫ్ట్స్, వాటర్, బౌద్ధ సర్క్యూట్లుగా ఆరు ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర వంటి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సర్క్యూట్‌లో ఉండగా, వరంగల్, చార్మినార్ ప్రాంతాలు వారసత్వ సర్క్యూట్‌లో చోటు పొందాయి. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించేలా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో హంపి తరహా థియేటర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పర్యాటక రంగ విస్తరణలో పరిశుభ్రత, నిర్వహణ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
