
వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా, సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సేవలందిస్తున్న విధానాలను సరళీకృతం చేయాలని, ప్రజలపై ఎలాంటి భారం పడకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ సేవలను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రాథమికంగా 11 రకాల సేవల విధివిధానాలను సరళీకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు తమ సమస్యలపై ఆన్‌లైన్‌తో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలన్నారు. చదువుకోలేని వారి సౌకర్యార్థం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 3 వేల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్, కనెక్టివిటీ సమస్యలు ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం, రాబోయే మూడు నెలల్లోగా ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని గడువు విధించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలు అంతరాయం లేకుండా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
నెలకు ఎనిమిది రోజులు కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనలు
పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలుగా సీనియర్ అధికారుల పర్యటనలపై ప్రభుత్వం కీలక సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దాని ప్రకారం ప్రతి నెల సచివులు మూడు రోజులు, శాఖాధిపతులు ఆరు రోజులు, జిల్లా కలెక్టర్లు ఎనిమిది రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధాన సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
‘నవచేతన’ కార్యక్రమంపై సమీక్ష
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్న పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పర్యవేక్షించేందుకు అమలు చేస్తున్న ‘నవచేతన’ ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా ఈ యాక్టివిటీ-ఆధారిత సిలబస్ పనిచేస్తుందని తెలిపారు.
ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లలను స్క్రీనింగ్ చేయడంతో పాటు, సిబ్బంది నేరుగా ఇళ్లను సందర్శిస్తున్నారని.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34,000 మంది పిల్లలకు స్క్రీనింగ్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. దీనిపై తదుపరి చర్యల కోసం ఒక పైలట్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.
సీఐఐ ప్రతినిధులతో భేటీ
అనంతరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఇతర ప్రతినిధి బృందంతో కలిసి సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్’ స్థాపన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎం వారిని కోరారు.
