Let's talk: editor@tmv.in
హోంమంత్రిపై వ్యాఖ్యలు అభ్యంతరకరం.. విమర్శలు విధానాలపైనే ఉండాలి: డిప్యూటీ సీఎం

హోంమంత్రిపై వ్యాఖ్యలు అభ్యంతరకరం.. విమర్శలు విధానాలపైనే ఉండాలి: డిప్యూటీ సీఎం

Gaddamidi Naveen
17 జూన్, 2026

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉండాలని, ఒక పాలసీ నచ్చకపోతే ఆ విధానంపైనే విమర్శలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి సదరు నాయకుడి పార్టీవారు దిగజారిపోయారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలు కేవలం అనితని మాత్రమే కాకుండా.. సమాజంలోని సగటు మహిళలందరినీ కించపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం నిశితంగా గమనిస్తోందనే విషయాన్ని నాయకులు మరచిపోకూడదన్నారు.

ఇదే సమయంలో కూటమి నాయకులందరికీ ఉపముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన సూచన చేశారు. వాచాలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరిచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టాలి. వారు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన, దిగజారుడు విషయం ఉందో ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలని ఆయ‌న పేర్కొన్నారు. కూటమి నాయకులందరూ పౌర సమాజం హర్షించే భాషలోనే మాట్లాడుతూ అవతలి పక్షానికి బలంగా బదులివ్వాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మాదిరి దిగజారుడు భాషను ఉపయోగించడం, అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం కూటమి ప్రభుత్వానికి అస్సలు అవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడే శక్తులకు ప్రజాస్వామ్యబద్ధంగానే బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.