Let's talk: editor@tmv.in
ఆలోచనలతో తెలంగాణకు రండి.. వాటిని నిజం చేసే బాధ్యత మాది: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

ఆలోచనలతో తెలంగాణకు రండి.. వాటిని నిజం చేసే బాధ్యత మాది: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
21 జూన్, 2026

హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఉన్న ఎస్‌ఏఎస్‌ ఐటవర్‌లో శనివారం నిర్వహించిన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం (హెచ్‌ఈఎఫ్)–2026 ఘనంగా ప్రారంభమైంది. “వన్ సిటీ.. వన్ విజన్.. ఇన్ఫినిట్ పొసిబిలిటీస్” అనే అంశంతో ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రా, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో 500 మందికిపైగా పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు “హైదరాబాద్ బికమింగ్ ఇండియాస్ ఇన్నోవేషన్ క్యాపిటల్” అంశంపై కీలక ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో దేశాల అభివృద్ధికి ఆలోచనలు, ప్రతిభ, ఆవిష్కరణలే ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ 81వ స్థానం నుంచి 39వ స్థానానికి ఎదగడం దేశంలోని ఆవిష్కరణ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు.

భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా ఎదిగిందని, తెలంగాణ దేశంలో అత్యంత చురుకైన ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని మంత్రి తెలిపారు. ఏఐకామ్, తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ (టీజీడెక్స్), రూ.1,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్, ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, 100 ఆధునిక ఐటీఐల వంటి కార్యక్రమాల ద్వారా వినూత్న ఆలోచనలకు ప్రభుత్వం బలమైన వేదికను అందిస్తోందన్నారు.

కృత్రిమ మేధస్సు ఆధారిత తరగతులు, ఏఐ లిటరసీ మిషన్ ద్వారా దాదాపు 20 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భవిష్యత్ నైపుణ్యాలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆవిష్కర్తలు, యువ పారిశ్రామికవేత్తలు, సృజనాత్మక ఆలోచనలతో ఉన్నవారికి నా సందేశం ఒక్కటే.. మీ ఆలోచనలతో తెలంగాణకు రండి. ప్రతి ఆలోచన విజయవంతం అవుతుందని హామీ ఇవ్వలేము. కానీ ప్రతి నిజాయితీగల ఆలోచనకు ప్రోత్సాహం, అవకాశాలు, ఎదుగుదలకు అవసరమైన మద్దతు అందిస్తాం అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

రోజంతా సాగిన ఈ సదస్సులో ఆర్థిక వృద్ధి, భవిష్యత్ మౌలిక సదుపాయాలు, డిజిటల్, ఏఐ పరివర్తన, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, పెట్టుబడులు, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్, విద్య, క్రీడలు, మహిళా నాయకత్వం వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఆర్థిక, ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కిచెప్పారు.

ట్యాగ్‌లు
HyderabadEconomicForum2026HEF2026HyderabadTelanganaSridharBabuInnovationCapitalInvestInTelanganaStartupIndiaTelanganaStartupsFutureOfInnovationDigitalTelangana
ఆలోచనలతో తెలంగాణకు రండి.. వాటిని నిజం చేసే బాధ్యత మాది: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు - Tholi Paluku