
వర్షభావ పరిస్థితులపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ సంజయ్ జాజు
రాష్ట్రంలో రుతుపవనాల రాక, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాల సంసిద్ధతపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు శనివారం జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. వర్షపాత లోటు వల్ల రైతులకు నష్టం జరగకుండా, ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ‘ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను’ సిద్ధం చేయాలన్నారు. రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, మార్గదర్శకత్వం అందించాలని, మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతన్నలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాలు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యారోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే ప్రథమ ప్రాధాన్యత కావాలని, ఎక్కడా నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా సాగడానికి అవసరమైన వంటగది మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగిన స్థలాలను త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. సంబంధిత శాఖలతో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ప్రాధాన్యతాంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, నవీన్ మిట్టల్, ఐఏఎస్ అధికారులు క్రిస్టినా చోంగ్తూ, ఇ. శ్రీధర్, సురేంద్ర మోహన్, టి.కె. శ్రీదేవి, హరిచందన, అభిలాష తదితరులు పాల్గొన్నారు.
