
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్ గరిమా అగర్వాల్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా చేపట్టిన "బడిబాట" కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ శుక్రవారం చందూర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులకు ఆమె స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. ప్రాథమిక విద్య యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు పాఠశాల యూనిఫాంలు పంపిణీ చేశారు.
అంతకుముందు, గత రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య లేక మూతపడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను, ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు పెరగడంతో కలెక్టర్ ప్రత్యేక చొరవతో తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందని, తల్లిదండ్రులు ఈ వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆ తర్వాత కిష్టంపేటలోని ప్రీ-ప్రైమరీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న విద్యాపరమైన బొమ్మలు, ఆట వస్తువులను పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న వయసులో ఆటపాటలతో కూడిన విద్య ఎంతో అవసరమని పేర్కొన్న కలెక్టర్.. పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా చూస్తూ, చదువు, బహిరంగ ఆటలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
