

30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించండి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వ్యవసాయ సీజన్‌లో పండించబోయే ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు.
2025-26 పంట కాలానికి (ఖరీఫ్, రబీ సీజన్లు) సంబంధించి సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర రైతాంగానికి సరైన మద్దతు ధర కల్పించడంతో పాటు, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడటమే ఈ విజ్ఞప్తి ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరా పెంపు అవసరమని కేంద్ర అధికారులు ఇటీవల సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2025-26 రబీ (యాసంగి) సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల మంత్రి కేంద్రానికి వివరించారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం, మెరుగైన సాగు నీటి వసతుల దృష్ట్యా ఈ భారీ దిగుబడిని ఆశిస్తున్నట్లు తెలిపారు.
భారీ స్థాయిలో వచ్చే ధాన్యాన్ని నిల్వ చేయడం, మిల్లింగ్ చేయడం పంపిణీ చేయడంపై కేంద్రం నుంచి స్పష్టత సహకారం కోరారు. ముఖ్యంగా పారాబాయిల్డ్ బియ్యం సేకరణపై ఉన్న అడ్డంకులను తొలగించాలని విన్నవించారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలు కూడా దీనిని నిరూపిస్తున్నాయని రాష్ట్ర ప్రతినిధులు వివరించారు.
రాబోయే 2025-26 సేకరణ సీజన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడానికి ఈ సమావేశం ఎంతో కీలకంగా మారింది. ధాన్యం సేకరణ విషయంలో గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండటానికి, ముందస్తుగా దిగుబడి అంచనాలను కేంద్రానికి అందజేయడం ద్వారా సానుకూల స్పందన లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మార్కెట్ మద్దతు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ నేపథ్యంలో, యాసంగి పంట నుంచి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో)తో పాటు 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఇక ఆర్థిక విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 2014–15 వర్షాకాలం పంటకు సంబంధించిన అదనపు లెవీ సేకరణలో రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలు విడుదల చేయడం అవసరమని పేర్కొన్నారు.
దేశంలో వరి ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అదనంగా, పిల్లల్లో రక్తహీనత నివారణ కోసం పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ కేంద్రాల్లో పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ (ఎఫ్ఆర్కే) సరఫరాను తిరిగి ప్రారంభించాలని కూడా కేంద్రాన్ని కోరింది.
