Let's talk: editor@tmv.in
యువత ఆకాంక్షలకు ప్రతిబింబమే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం:పల్లా శ్రీనివాసరావు

యువత ఆకాంక్షలకు ప్రతిబింబమే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం:పల్లా శ్రీనివాసరావు

Panthagani Anusha
25 మే, 2026

దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దావానలంలా వ్యాపిస్తూ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు. ఈ ఉద్యమం ప్రస్తుత యువత ఆకాంక్షలు, వారి ఆందోళనలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. యువతలో ఉన్న అసంతృప్తి, ఉపాధి సమస్యలు, ప్రభుత్వ విధానాలపై జరుగుతున్న ఈ చర్చలను విధాన నిర్ణేతలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎల్లప్పుడూ యువత సాధికారతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయని గుర్తుచేశారు. ఉద్యోగాల సృష్టి, ఆర్థికాభివృద్ధి, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఇలాంటి ఉద్యమాల ఆవిర్భావం యువత అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను నిరంతరం సమీక్షించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని వారి ఆకాంక్షలను తప్పకుండా విధాన నిర్ణేతల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

అయితే నిరుద్యోగం, ఇటీవల వెలువడిన కొన్ని ప్రజా వ్యాఖ్యలు యువతలో అసంతృప్తికి దారితీసి ఉండవచ్చని అభిప్రాయపడిన ఆయన, నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాలో జరిగే చర్చలను బాహ్య శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభావితం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారతదేశం ప్రపంచస్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో దేశ ప్రగతిని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశముందని ఎన్డీయే భాగస్వామిగా తాము విధానాధారిత పాలనకు మరియు యువతకు మెరుగైన ఉపాధి కల్పనకే కట్టుబడి ఉన్నామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఉద్యమంపై కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్న వ్యవస్థీకృత ప్రయత్నమని ఆరోపించారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. టిఎంసి, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు యువత కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు హఠాత్తుగా యువతపై ప్రేమ ఒలకబోయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఆ ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అసలు ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ఎలా ప్రారంభమైందనే అంశాన్ని పరిశీలిస్తే.. ఇది కోర్టు విచారణల నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ నిరసనగా మారింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కోర్టు విచారణ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలను, నిరుద్యోగ యువతను “కాక్‌రోచ్‌లు”, “పరాన్నజీవులు”గా సంబోధించినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వ్యాపించడమే దీనికి కారణం. అనంతరం సీజేఐ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని నకిలీ న్యాయ డిగ్రీలు ఉపయోగించే వ్యక్తులను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టత ఇచ్చారు.

కోర్టు వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే ఈ అంశం నెట్టింట వైరల్ కావడంతో జెన్ జెడ్ మిల్లేనియల్ నెటిజన్లు ఆ ‘కాక్‌రోచ్’ అనే పదాన్నే ఒక వ్యంగ్య ప్రతీకగా మార్చుకుని, ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ అనే డిజిటల్ ఉద్యమానికి తెరతీశారు. కేవలం వారం రోజుల్లోనే ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో లక్షలాది మంది మద్దతు లభించింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ దేశంలో ఉపాధి అవకాశాలు, యువత భವಿష్యత్తు వంటి గంభీరమైన అంశాలపై ఇది దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కాగా ఈ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో దీనికి ప్రధాన వేదికగా ఉన్న ‘@CJP2029’ అనే ఎక్స్ ఖాతాను చట్టపరమైన డిమాండ్ల మేరకు భారతదేశంలో నిలిపివేసినట్లు ఎక్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.