


హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగిన అక్రమాలకు నిరసనగా హైదరాబాద్‌లో ఆదివారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పలు ఇతర విద్యార్థి, విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో హాజరైన నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక విద్యావేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో భయ్ ముక్త్ భారత్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. వ్యవస్థలో జరిగిన లోపాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, దేశంలో ఒక సంపూర్ణ ప్రజాస్వామ్యం నడవాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు లేకుండా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండే, ద్వేషం లేని భారతదేశాన్ని చూడాలని ఆకాంక్షించారు.
తాము చేపట్టిన ఈ ఉద్యమం కేవలం అధికారం కోసమో, ఏదో ఒక రాజకీయ పార్టీని సవాల్ చేయడానికో కాదని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి, వారి హక్కులను కాపాడటానికి మాత్రమే ఈ పోరాటం జరుగుతోందన్నారు. ఇది ఒక మంత్రి పదవి కోసమో లేదా కొత్త పార్టీని స్థాపించడానికో వచ్చిన ఉద్యమం కాదని, దేశంలోని యువతకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఉద్భవించిన ఒక గొప్ప చైతన్యమని ఆయన అభివర్ణించారు.
కేవలం పరీక్షల నిర్వహణ లోపాలను సరిదిద్దడమే కాకుండా, విద్యా వ్యవస్థకు ఒక బలమైన పునాదిని నిర్మించేందుకు భవిష్యత్తులో ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పరీక్షలు రద్దు కావడం, పేపర్లు లీక్ కావడం ద్వారా మొత్తం విద్యా వ్యవస్థే తప్పుదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సత్యం, అహింసా మార్గంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, నష్టపోయిన విద్యార్థులందరికీ త్వరలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. భారతదేశంలో కొన్ని పాఠశాలలు అమెరికా కంటే అద్భుతమైన విద్యను అందిస్తుంటే, మెజారిటీ విద్యార్థులు మాత్రం సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల కంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారని వాపోయారు. రాబోయే తరాల పరిస్థితి ఇలా ఉంటే.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.
ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు, నేతలు ‘మాకు న్యాయం కావాలి’, ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులుతో ‘స్టాప్ పేపర్ లీక్’, మా కలలు అమ్మకానికి కావు అంటూ నిరసన తెలిపారు. కొందరు విద్యార్థులు జస్టిస్ ఫర్ నీట్ స్టూడెంట్స్ అని రాసి ఉన్న టీ-షర్టులను ధరించి కనిపించారు.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దిప్కే ఈ ప్రతినిధుల సభకు హాజరుకాలేకపోగా, పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 11న పూణేలో కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమాన్ని అభిజీత్ దిప్కే ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు మాత్రమే ధర్నాకు అనుమతి ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
