
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వ చర్యలు
రాష్ట్ర ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సెక్రటేరియట్‌లో శుక్రవారం జరిగిన ధరల స్థిరీకరణ మంత్రుల కమిటీ 8వ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
బహిరంగ మార్కెట్‌లో బియ్యం, పప్పులు, వంట నూనెలు, ఉల్లిపాయలు, టమోటా వంటి వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్‌సేల్ ధరలను నిత్యం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల వంటనూనెల ధరలు పెరిగినప్పటికీ, రాష్ట్రంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. రాబోయే మూడు నెలల్లో ధరలను అదుపులో ఉంచి సామాన్యుడిపై భారం పడకుండా ముందస్తు చర్యల కోసం అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఖరీఫ్-2026 సన్నద్ధత – వరి రకాలపై అవగాహన
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రులు తెలిపారు. డిమాండ్ తక్కువగా ఉండి, నూక శాతం ఎక్కువగా వచ్చే 1010, పీఆర్-126 వంటి వరి రకాలను సాగు చేయడం వల్ల కొనుగోళ్ల సమయంలో రైతులు నష్టపోతున్నారని వివరించారు. అందువల్ల మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న ప్రాధాన్య వరి వంగడాల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.
