Let's talk: editor@tmv.in
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని అన్నదాతల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. రైతు సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని శనగ, మొక్కజొన్న సాగు పరిస్థితులను కేంద్రానికి వివరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

శనగ రైతులకు ఊరట.. అదనపు కొనుగోళ్లకు అనుమతి

రాష్ట్రంలో ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం పెరగడంతో సుమారు 7.13 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయి దిగుబడి వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రమంత్రికి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం 94,500 మెట్రిక్ టన్నుల కొనుగోలును విజయవంతంగా పూర్తి చేసిందని అయితే నిల్వలు ఇంకా పేరుకుపోయినందున మిగిలిన పంటను కూడా సేకరించాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్ పీఎస్ఎస్ పథకం కింద తక్షణమే అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగల కొనుగోలుకు అనుమతి జారీ చేశారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నులను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

మొక్కజొన్న కొనుగోలుపై ప్రత్యేక దృష్టి

మరోవైపు రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పంట మార్పిడి విధానం వల్ల రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు పతనమై రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మొక్కజొన్న పీడీఎస్ పరిధిలోకి రాకపోయినప్పటికీ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కేంద్రంతో సమన్వయం.. త్వరలోనే నిర్ణయం

ఈ అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సంప్రదింపులు జరిపి త్వరలోనే రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా చూస్తామని, అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని ఆయన స్పష్టం చేశారు.