Let's talk: editor@tmv.in
ఉపాధి హామీ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం: వైఎస్ జగన్

ఉపాధి హామీ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం: వైఎస్ జగన్

Panthagani Anusha
22 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అసమర్థత, అంతులేని అవినీతి కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. గ్రామీణ ప్రజలకు వెన్నెముకగా నిలవాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. పల్లె ప్రజల జీవనాధారమైన ఈ పథకం అమలులో ఏపీ ఒకప్పుడు దేశంలోనే ముందంజలో ఉండేదని కానీ గత రెండేళ్లలో కూటమి పాలనలో దారుణంగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక చక్రం ఆగిపోయింది

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు చేరాలని తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని జగన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని విశ్లేషించారు. రాష్ట్రంలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి రేటు గత రెండేళ్లుగా మందగించడానికి పల్లెల్లో ప్రజల ఆదాయం తగ్గడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధికార పక్షం కేవలం ‘ధనదాహం, ఆస్తుల సంపాదన పైనే దృష్టి పెట్టిందని సామాన్యుడి సమస్యలను వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదని నిప్పులు చెరిగారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉదహరిస్తూ జగన్ పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాది నాటి గణాంకాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వ రెండో ఏడాది నాటికి పరిస్థితి దిగజారిందని వివరించారు. ముఖ్యంగా వంద రోజుల పని పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య ఏకంగా 68 శాతం మేర పడిపోయిందని ఆరోపించారు. పనిచేసిన కుటుంబాల సంఖ్య 46.5 లక్షల నుంచి 42.8 లక్షలకు, పనిచేసిన వ్యక్తుల సంఖ్య 75.4 లక్షల నుంచి 67.6 లక్షలకు తగ్గిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.

వేతనాల్లో రూ.1,000 కోట్ల కోత

ఉపాధి హామీ వ్యయం గతంలో రూ. 9,000 కోట్లుగా ఉండగా అది ప్రస్తుతం రూ. 8,000 కోట్లకు పడిపోయిందని జగన్ వెల్లడించారు. ఇది సుమారు 11.5 శాతం క్షీణత అని పేర్కొన్నారు. ముఖ్యంగా అప్రశిక్షిత కార్మికులకు చెల్లించే వేతనాలు రూ. 6,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు తగ్గిపోయాయని అంటే పేదవాడి కష్టార్జితంలో 21 శాతం కోత విధించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం అవినీతి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.